ఉద్యోగులకు సర్కార్‌ గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో మాత్రమే..!

ఉద్యోగులకు సర్కార్‌ గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో మాత్రమే..!

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్‌ సిటీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం శనివారం నుంచి ప్రత్యేకంగా బస్సులు నడపనుంది.. లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు వచ్చినా.. హైదరాబాద్‌ సిటీలో ప్రజారవాణా వ్యవస్థ అందుబాటులోకి రాలేదు.. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నా.. శివారు ప్రాంతాల నుంచి జిల్లాలకు గ్రామాలకే వెళ్తున్నాయి.. హైదరాబాద్‌లో మెట్రో రైలు కూడా అందుబాటులోకి రాలేదు.. దీంతో.. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడపనున్నారు.. ఈ విషయాన్ని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు వారి ఇళ్ల నుంచి ఆఫీసులకు వెళ్లేందుకు వీలుగా ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇక, ఉద్యోగులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు కారం రవీందర్‌రెడ్డి.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆఫీసులకు వచ్చే వారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని.. అయితే, ఉద్యోగులు తప్పనిసరిగా వారి ఐడీ కార్డు చూపిస్తేనే బస్సులోకి అనుమతిస్తారని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌ సిటీలోని 32 మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం బస్సు సౌకర్యాన్ని కప్పించనున్నారు.