'ప్లాన్‌ ప్రకారమే షాపై దాడి'

'ప్లాన్‌ ప్రకారమే షాపై దాడి'

బీజేపీ జాతీయ అధ్యక్షుడు తిరుమల పర్యటన వేళ దాడి జరగడం సంచలనమైంది. ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అమిత్‌షా... తిరిగి వెళ్తుండగా అమిత్‌షా కాన్వాయ్‌పై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనకారులు... అమిత్‌షా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ దాడి ఘటనపై స్పందించిన బీజేపీ నేత సోము వీర్రాజు... ఇదంతా పక్కా ప్రీ ప్లాన్‌డ్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఇలాంటి ఘటన జరిగే అవకాశం ఉందని... మా నేతలు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ... ఈ దాడి జరగడం దారుణమైన ఘటన అని వెల్లడించారాయన. 

చంద్రబాబు మదిలో కేంద్రంపై గూడుగట్టుకున్న కసిని బీజేపీ చీఫ్ అమిత్‌షాపై చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించిన సోమువీర్రాజు... ఇది చంద్రబాబు, టీడీపీ శ్రేణుల వైఖరిని స్పష్టంగా తెలియజేస్తుందన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచివికావని వెల్లడించిన బీజేపీ ఎమ్మెల్సీ... రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతోందన్న ఆందోళనతోనే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అయితే టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తే... తమ కార్యకర్తలు ఏమయ్యారో అంటూ టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నామంటూ ప్రకటించడం హాస్యాస్పదమన్నారాయన. చంద్రబాబు వైఖరికి ఇది నిదర్శనమని ఆరోపించారు సోము వీర్రాజు.