లాక్‌డౌన్‌.. పడిపోయిన స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు

లాక్‌డౌన్‌..  పడిపోయిన స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది.  ఇప్పుడు పలు దేశాల్లో లాక్ డౌన్ కూడా ప్రకటించడంతో అన్ని రకాలుగా నష్టం జరుగుతోంది. ఇక ఈ ప్రభావం స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలపై పడింది. గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 14 శాతం పడిపోయాయి. హాంకాంగ్‌ ప్రధాన కేంద్రంగా పనిచేసే గ్లోబల్‌ ఇండస్ట్రీ అనాలిసిస్‌ సంస్థ కౌంటర్‌పాయింట్‌ రిసెర్చ్‌ ఫిబ్రవరి నెలకు సంబంధించిన నివేదికను విడుదలచేసింది. దీనిప్రకారం ఆపిల్‌ ఫోన్లతోపాటు, ఇతర స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు 14 శాతం తగ్గిపోయాయి. ఇక  ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్‌ తన ప్రధాన మార్కెట్‌ అయిన చైనాలో ఫిబ్రవరి నెలలో 5 లక్షలలోపే అమ్మకాలు జరగలిగింది. ఇది గతేడాదితోపోల్చితే 38 శాతం తక్కువ.. దీనికితోడు ప్రస్తుతం చైనా, దక్షిణ కొరియా మినహా ప్రపంచ దేశాలపై కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రభావం చూపుతుండటంతో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు మరింత క్షీణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు