ఎన్‌పీఏలుగా చిన్న ఇంటి రుణాలు

ఎన్‌పీఏలుగా చిన్న ఇంటి రుణాలు

ఇప్పటి వరకు పెద్దరుణాలకే పరిమితమైన నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏలు) గొడవ ఇపుడు చిన్న రుణాలకు పాకింది. ఇవాళ పరపతి విధానాన్ని సమీక్షించిన ఆర్‌బీఐ చిన్న ఇంటి రుణాలపై బ్యాంకులకు హెచ్చరిక చేసింది. రూ. 2 లక్షల లోపు  ఇంటి రుణాల కేటగిరీలో కూడా ఎన్‌పీఏలు పెరుగుతున్న విషయాన్ని ఆర్‌బీఐ గుర్తించింది.  'హౌసింగ్‌ లోన్ల డేటాను  పరిశీలిస్తే... రూ. 2 లక్షల లోపు రుణాలలో ఎన్‌పీఏలు భారీగా పెరుగుతున్నాయి. మునుపెన్నడూ లేనంత అధికంగా ఉన్నాయి. ఈ రంగంలో రిస్క్‌ పెరుగుతోంద'ని ఆర్‌బీఐ తన నివేదికలో స్పష్టం చేసింది. దేశంలో దాదాపు వంద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు చిన్న స్థాయి ఇంటి రుణాలను విరివిగా ఇస్తున్నాయి. పైగా ఈ మార్కెట్‌ ఏటా 24 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. అన్ని బ్యాంకులు ఇపుడు ఈ రంగంపై దృష్టి సారించాయి. కాని ఇదే రంగంలో ఎన్‌పీఏ పెరుగుతున్న విషయాన్ని బ్యాంకులు గుర్తించి... ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ హెచ్చరించింది.