ఎట్టకేలకు ఫలించిన 60 ఏళ్ల ఎదురుచూపులు

ఎట్టకేలకు ఫలించిన 60 ఏళ్ల ఎదురుచూపులు

కత్తులు దూసుకునే రెండు దేశాలు కరచాలనాలతో పులకించిపోతున్నాయి. నార్త్ కొరియా, సౌత్ కొరియా దేశాధినేతలు కొన్ని నెలల క్రితం భేటీ అయిన ఫలితంగా.. అనుమానాల స్థానంలో క్రమంగా ఆత్మీయతలు నెలకొంటున్నాయి. 1950-53 కొరియా యుద్ధం తరువాత రెండు దేశాలూ అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. ఆ యుద్ధంలో ఆత్మీయుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని కోల్పోయినవారంతా దశాబ్దాలుగా తమవారిని ఎప్పుడు కలుస్తామా అంటూ ఎదురు చూశారు. ఒకరకంగా చెప్పాలంటే అలాంటి అద్భుతమైన ఘడియల కోసం కళ్లలో వత్తులు వేసుకొని ప్రాణాలు ఉగ్గబట్టుకొని బతికినవారు ఎందరో.

రెండు దేశాల మధ్య జరిగిన ఒడంబడికలో భాగంగా అలాంటివారంతా సోమవారం కలుసుకున్నారు. ఆరు దశాబ్దాల ఎడబాటు తరువాత కలుసుకున్న అద్భుతమైన సన్నివేశానికి సియోల్ వేదికైంది. తల్లి కోసం తనయుడు, కుమారుడి కోసం తండ్రి, తమ్ముడి కోసం అన్న, సోదరి కోసం సహోదరుడు, స్నేహితుడి కోసం ఓ వృద్ధ ప్రాణం.. ఇలా ఆబగా ఎదురుచూస్తూ.. గుర్తు పట్టగానే పరవశించిపోయి మాటలు రాక కన్నీళ్లతోనే పలకరించుకున్నారు. ఆత్మీయ ఆలింగనాలు తప్ప మాటల్లో చెప్పలేని మధుర స్మృతుల్ని తడబడే గొంతులతోనే నెమరు వేసుకున్నారు.

సౌత్ కొరియా 89 కుటుంబాల నుంచి 330 మంది వృద్ధులు.. తమ నుంచి దూరమై నార్త్ కొరియాలో ఉంటున్న 185 మందిని కలుసుకున్నారు. మొత్తమ్మీద రెండు వైపుల నుంచీ 93 కుటుంబాలు సోమవారం నుంచి 3 రోజుల పాటు గ్యాదరింగ్ లో పాలుపంచుకుంటారు. ఆ తరువాత గురువారం నుంచి మరో 3 రోజుల పాటు ఇరువైపులా 88 కుటుంబాల నుంచి గ్యాదరింగ్ లో పాల్గొంటారు. సౌత్ కొరియా నుంచి 469 మంది, నార్త్ కొరియా నుంచి 128 మంది తమ ఆరు దశాబ్దాల ఎదురుచూపులను కలబోసుకుంటారు. 

చిన్నప్పుడెప్పుడో అన్నకు దూరమై సౌత్ కొరియాలో బతుకుతున్న ఓ చెల్లి.. తన అన్న చిన్ననాటి ఫొటో ఆధారంగా అన్నను గుర్తు పట్టడం ఓ అద్భుతం. ఇలాంటి అద్భుతమైన ఆత్మీయ దృశ్యాలు తాజా గ్యాదరింగ్ లో ఎన్నో.. ఎన్నెన్నో. 

ఇలాంటి ఓ గ్యాదరింగ్ కోసం రెండు దేశాల నుంచీ బంధువులు పట్టుబడుతూ వస్తున్నారు. కానీ నానాటికీ పెరిగిన ఉద్రిక్తతల కారణంగా వారంతా అయినవారికి దూరమయ్యారు. సౌత్ కొరియా దగ్గరున్న లెక్కల ప్రకారం కుటుంబాలకు దూరమైన వారి సంఖ్య లక్షా 32 వేలు. అయితే అందులో బతికున్నవారి సంఖ్య మాత్రం 57 వేలేనని గణాంకాలు సూచిస్తున్నాయి. వారి కోరిక మేరకే బంధువుల రీ-యూనియన్ కు ఏర్పాటు చేశారు. అయితే వారిలో 41.2 శాతం 80 ఏళ్లు పైబడ్డవారైతే.. 21.4 శాతం మంది 90 ఏళ్ల వయసులో ఉన్నారు. ఈ లెక్కల్లో లేనివారంతా తమవారి కోసం ఎదురుచూసి ప్రాణాలు కోల్పోయినవారేనన్నమాట.