అయోమయంలో షేర్‌ మార్కెట్లు

అయోమయంలో షేర్‌ మార్కెట్లు

రేపు వెల్లడి కానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్టాక్‌ మార్కెట్‌కు కీలకం కానున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు రేపటి ఫలితాలను మోడీ భవిష్యత్తుకు సూచికగా భావిస్తున్నారు. స్టాక్‌ మార్కెట్లు ఇప్పటికే గరిష్ఠ స్థాయిల్లో ట్రేడవుతుండటంతో ఏమాత్రం రిస్క్‌ తీసుకోవడానికి ఇన్వెస్టర్లు ఇష్టపడటం లేదు. ఎందుకంటే కర్ణాటక ఫలితాల్లో ఏమాత్రం తేడా వచ్చినా.. మరో ఆరు నెలల్లో జరిగే రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఏడాదిలో జరిగే సాధారణ ఎన్నికలపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో సోమవారం ఇన్వెస్టర్లు ఆచితూచి ట్రేడ్‌ చేశారు. 

హంగ్‌ వస్తే..

చాలా మంది ఇన్వెస్టర్లు రేపటి ఫలితాల్లో హంగ్‌ రావడం ఖాయమని భావిస్తున్నారు. ఇదే పరిస్థితి వస్తే బీజేపీ, జనతాదళ్‌ (ఎస్‌) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ముంబై పంటర్లు అంచనా వేస్తున్నారు. వీలైతే సీఎం సీటు జనతాదళ్‌కు ఇచ్చి... కాంగ్రెస్‌ మళ్ళీ అధికారంలోకి రాకుండా మోడీ చూస్తారనేది వీరి అంచనా. ఇదే జరిగితే మార్కెట్‌లో ఓ చిన్నపాటి ర్యాలీకి అవకాశం ఉండొచ్చు. ఈ ర్యాలీ కూడా స్వల్పకాలిక ర్యాలీనే. ఎందుకంటే అమెరికాతో పాటు భారత్‌లోనూ వడ్డీరేట్లను పెంచేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి.

బీజేపీకి ఛాన్స్‌ వస్తే...

నిజంగా ఇలాంటిదే జరిగితే మార్కెట్‌లో భారీ ర్యాలీ ఖాయంగా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు  హంగ్‌ను మాత్రమే మార్కెట్‌ డిస్కౌంట్‌ చేసింది. అలాకాకుండా.... బీజేపీకి మెజారిటీ వచ్చే పక్షంలో సూచీలు పరుగులు అందుకోవచ్చు. కాని ఈ ర్యాలీ కూడా స్వల్ప కాలమే ఉంటుంది. దీనికి కారణం మార్కెట్‌ ఆల్‌టైమ్‌ హైలో ఉండటమే.

కాంగ్రెస్‌ గెలిస్తే...

కాంగ్రెస్‌ సొంతంగా మెజారిటీ సాధిస్తే... మార్కెట్‌లో ఓ భారీ డౌన్‌ట్రెండ్‌కు ఆస్కారముంది. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీ గ్రామాల్లోనే రాణిస్తుందనే అంచనా ఉంది.అయితే ఆ ప్రాంత సీట్లతోనే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. మెజారిటీ సీట్లు వస్తే మాత్రం.. పట్టణాల్లో కూడా కాంగ్రెస్‌ ఆదరణ పెరిగిందనే చెప్పాల్సి ఉంటుంది. అలాగే గ్రామాల్లో గనుక బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలితే.. మార్కెట్‌లో పరిస్థితి దారుణంగా ఉంటుందని స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వస్తున్నారు. నోట్ల రద్దుతో పాటు వ్యవసాయం దారుణంగా ఉందనే వార్తల నేపథ్యంలో రైతులు మోడీ పక్షాన నిలుస్తారా అనేది రేపటి ఫలితాల్లో తేలనుంది. ఒకవేళ గ్రామాల్లో బీజేపీ ఓడితే... మోడీ కూడా వెంటనే తన ఆర్థిక విధానాలను మార్చుకోవచ్చు. మరిన్ని ప్రజాకర్షక పథకాలవైపు మోగ్గు చూపవచ్చు. అంటే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడమే. ఇలాంటి పరిస్థితి మార్కెట్లకు రుచించవు కాబట్టి... భారీ పతనం ఖాయం. కాని అలాంటి పరిస్థితి వస్తుందని మాత్రం మార్కెట్‌ వర్గాలు భావించడం లేదు.