నిఫ్టికి పెట్రో మంట...

నిఫ్టికి పెట్రో మంట...

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గకపోవడంతో పాటు దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లలో భారీ అమ్మకాల ఒత్తడి వచ్చింది. హెచ్‌పీసీఎల్‌ షేర్‌ ఏకంగా 8 శాతంపైగా నష్టపోగా బీపీసీఎల్‌ షేర్‌ 5 శాతం పడింది. అలాగే ఓఎన్‌జీసీ  షేర్‌ కూడా అయిదు శాతం క్షీణించింది. మిడ్‌ సెషన్‌ వరకు ఓ మోస్తరు నష్టాలతో నిలకడగా ఉన్న మార్కెట్‌పై ... యూరో మార్కెట్ల పతనంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ప్రధాన యూరో మార్కెట్ల డేటా నిరుత్సాహకరంగా ఉండటంతో యూరో మార్కెట్లు భారీగా క్షీణించాయి.

మరోవైపు ఇవాళ రాత్రికి మే  2 జరిగిన ఫెడరల్‌ రిజర్వ్‌ మినిట్స్‌ వెల్లడి కానుండటంతో....అమెరికా ఫ్యూచర్స్ కూడా దాదాపు ఒక శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి ఏకంగా 106 పాయింట్ల నష్టంతో 10,430 వద్ద ముగిసింది. మార్కెట్‌ అత్యంత కీలకమైన 10500 దిగువన నిఫ్టి క్లోజ్‌ కావడం ఇన్వెస్టర్లలో ఆందోళన కల్గిస్తోంది. కర్ణాటక ఎన్నికల కౌంటింగ్‌ రోజు నుంచి నిఫ్టి ఇప్పటి వరకు 500 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఎస్‌బీఐ 3 శాతం లాభంతో ముగిసింది. టెక్‌ మహీంద్రా,సిప్లా రెండు శాతం పెరగ్గా యూపీఎల్‌, ఎల్‌ అండ్‌ ఒక శాతం పెరిగాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ముందున్నాయి. ఇవి కాకుండా వేదాంత, టాటా స్టీల్‌ షేర్లు కూడా 6 నుంచి 7 శాతం దాకా క్షీణించాయి. ఇక బీఎస్ఈలో మార్క్ సన్స్ 10 శాతం పెరగ్గా, శ్రీరామ్‌ సిటీ 8 శాతం లాభపడింది.  ఐడీబీఐ, ఆంధ్రా బ్యాంక్‌ షేర్లు అయిదు శాతంపైగా లాభపడ్డాయి.