చిత్ర  పరిశ్రమ విచిత్రాలకు సాక్షి రావికొండలరావు

చిత్ర  పరిశ్రమ విచిత్రాలకు సాక్షి రావికొండలరావు

 తెలకపల్లి రవి 

      రావి కొండరావు  కన్నుమూతతో  చిత్ర పరిశ్రమ చరిత్రకు సాక్షిగా, భాగస్వామిగా, నిలిచిన ఒక విజ్ఞాన సర్వస్వం మూగవోయిందనిచెప్పాలి. సినిమా బంధంతో  పాటు సినీ జర్నలిజాన్ని తీర్చిదిద్దిన కలం ఆగిపోయింది. చిత్తూరు నాగయ్య నుంచి బాలయ్య అనబడే బాలకృష్ణ భైరవ ద్వీపం వరకూ ప్రత్యక్షంగా చూసిన అనుభవశాలి ఆయన. మద్రాసు వెళ్లిన కొత్తలో ఏ ఇళ్లు చూసినా ఇది నాగయ్యది అనేవారనీ తర్వాత ఆ నాగయ్యే వేషా కోసం నిర్మాత చుట్టూ తిరగడం చూశానని నాతో  ఒక ఇంటర్వ్యూలో చెప్పి చిత్ర పరిశ్రమ తీరుతెన్నుల పట్ల ఆశ్చర్యపడ్డారు. 

ఎన్టీఆర్‌  ఏఎన్నార్  నటులు గా రంగ ప్రవేశం చేసినరోజుల నుంచి రావి కొండరావు చూశారు. అక్కినేని గీతాకేఫ్‌లో కాఫీ తాగడానికి సైకిల్‌పై వచ్చేవారట. ఇక ఎన్టీఆర్‌ మనదేశంలో మొదటిసారి ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తుంటే మరింత భావావేశంతో డైలాగు చెప్పాని ఎల్‌వి ప్రసాద్‌ సూచించారట. ఆ దృశ్యం అయిపోయాక ఎన్టీఆర్‌ అందులో ప్రధాన పాత్రధారి సిహెచ్‌ నారాయణ రావు దగ్గరకు వెళ్లి బాగా నటించానా అని అడిగారట. అదే నారాయణరావు కొన్ని దశాబ్దాల తర్వాత ఎన్టీఆర్‌ శ్రీకృష్ణపాండవీయం తీస్తున్నప్పుడు ఏదైనా రుషి వేషమైనా ఇప్పించమని అడుగుతుంటే రావికొండరావుకు గతం కళ్లముందు తిరిగింది. మనసు కవి ఆత్రేయ పాటరాస్తే చాలని నిర్మాతు చుట్టూ తిరిగిన కాలం ఒకటైతే తర్వాత దశ మారింది. 

తననుసహాయకుడుగా పెట్టుకోమని ఈయన వెళ్లి అడిగితే నేనే సహాయకుడిలా తయారైనానన్నారట. ఇలాటి అనుభవాన్నీ రావి కొండలరావును జాగ్రత్తగా అడుగులేసేట్టు చేశాయి. భార్యరాధాకుమారి కూడా నటి కావడంతో ఇద్దరికీ కలిపి వేషాలివ్వడం వల్ల నిర్మాతకు కూడా సౌలభ్యంగా వుండేది. ఏవో చిన్న వేషాలు వేస్తూ బతుకు గడిపారు. తన మాటకు నవ్వు వచ్చివుండొచ్చు గాని తాను హాస్య నటుడిని కాదంటారాయన. హీరో వేషాలు ఒకేలా వుంటాయిగాని క్యారెక్టర్‌ పాత్రులు వేసే వారు ప్రతివారి మ్యానరిజమ్స్‌ గమనిస్తుండాని సోదాహరణంగా చెబుతారు.


          చాలా చిన్న వయసులోనే కథ రాసినరావి కొండలరావు రచయితగానే మద్రాసు వచ్చారు. పలు సినిమా పత్రికలో పని చేశారు. అయితే తొలి ఆఫ్‌సెట్‌ రంగుల పత్రిక విజయచిత్ర సహాయ సంపాదకుడుగా ఆయన విలక్షణ పాత్ర పోషించారు. రంగుల బొమ్ములు  ఇంటర్వ్యూతో అది పత్రికల గమనాన్నే మార్చేసింది. విజయ సంస్థలో అప్పుడే రావికొండలరావు స్థానం స్థిరపడిరది. వారు తనపై నమ్మకంతో బాధ్యతులు అప్పగించేవారని ఎంతో గౌరవంగా చెప్పేవారు. 

ఎన్నో  అపురూప చిత్రాలందించిన విజయ సంస్థలో  దర్శకుడుగా కెవి రెడ్డి ప్రాధాన్యత నడుస్తున్నప్పుడు ఎన్టీఆర్‌తో వరుసగా మూడు చిత్రాలు భాగ్య చక్రం సత్యహరిశ్చంద్ర,ఉమా చండీ గౌరీశంకరులు కథ దెబ్బతిన్నాయి. నాగిరెడ్డి సంస్థనే మూసివేశారు. ఆ తర్వాత మూడు దశాబ్దాలకు ఆయన కుమారుడైన వెంకట్రామిరెడ్డి మళ్లీ చిత్ర నిర్మాణం ప్రారంభించానుకుని రావి కొండలరావును పిలిపించారు. 

రాజేంద్ర ప్రసాద్‌తో బృందావనం, బాలకృష్ణ భైరవద్వీపం  ఆ విధంగానే రూపొందాయి. వీటికి రచన రావికొండలరావే. భైరవద్వీపంలో మరగుజ్జు, శాపంతో హీరో వృద్ధాప్యం పొందడం వంటివి కొత్త తరహాలో పెట్టారు.తన కెరీర్‌కు మొదట్లో తోడ్పడిన ముళ్లపూడి వెంకటరమణ బాపు కోసం పెళ్లి పుస్తకం కథ రాశారు. (ఇది ఒకప్పటి మిస్సమ్మకు రివర్స్‌ లాటిదే) ఈ చిత్రం ఆయనకు అవార్డు తెచ్చిపెట్టింది. 600 చిత్రాలో నటించినా సహాయ దర్శకుడుగా పనిచేసినా దశాబ్దాలు పాటు పరిశ్రమలో వున్న రావి కొండలరావు వివాదాలకు ఇసుమంతైనా ఆస్కారం ఇవ్వలేదు. విజయచిత్రలో భానుమతి జీవిత కథ వేస్తూండగా మిస్సమ్మ నాటి విషయమై వివాదం రావడంతో మధ్యలోనే ఆపేశారు!

     నాటకకర్తగా ఆయన రాసిన  కుక్కపిల్ల దొరికింది ప్రొఫెసర్‌ పరాంకుశం వంటి వాటి గురించి బాగా చెప్పుకుంటారు. చౌచౌలు స్కిట్‌లలో సిద్దహస్తులు . సినిమాలో స్థిరపడ్డాక కూడా వీలు దొరికితే నాటకాలు వేసేవారు. మద్రాసులో సాంసృతిక వేడుకులు సమ్మేళనాల ప్రయోక్తగా ఆయన అగ్రభాగాన వుండేవారు. అన్ని తరాలతో సంబంధం పాత్రికేయ వృత్తి, సాహిత్య పరిజ్ఞానంతో అవలీలగా వాటిని నిర్వహించేవారు. ఆరుద్ర షష్టిపూర్తి 1985లో జరిగినపుడు ఆఖరి వరకూ  దంపతు దగ్గరుండి పనిచేయడం బాగా గుర్తు.  ని సంపాదకత్వంలో  రూపొందించినమన సినిమాలు పుస్తకంలోనూ ఆయన వ్యాసం వుంది. గత ఆగష్టులో  ఆ పుస్తకాన్ని ఫిలించాంబర్‌లో పవన్‌కళ్యాణ్‌ ఆవిష్కరించినపుడు ఒక్క ఫోన్‌కాల్‌ చేస్తే ఓపికగా వచ్చి పాల్గోన్నారు. పితామహుడి వంటి ఆయన వచ్చినందుకు అంతా సంతోషించారు. చివరి రోజుల్లో ఒక టీవీ ఛానల్‌తో ఒప్పందం కుదర్చుకుని జ్ఞాపకాన్నీ రికార్డు చేస్తూ వచ్చారు. ఆ కారణంగానే  సినిమా గురించి తప్ప ఇతర విషయాలైతే చెబుతాననేవారు. అయినా కదిలిస్తే వాటికవే ఆ జ్ఞాపకాలు ప్రవహించేవి. ఇప్పుడవి మనకు మిగిల్చి జీవిత రంగం నుంచి సెలవు తీసుకున్న రావి కొండలరావు గారికి  ఇదే కళాంజలి.