సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అఖిల...హ్యాట్సాఫ్ !

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అఖిల...హ్యాట్సాఫ్ !

 సర్పంచ్‌ అంటే.. ఊరికి పెద్దే కాదు. ఊరికి ఏమోచ్చినా చూసుకునే  పెద్ద మనసు కావాలి. 23 ఏళ్ల అఖిల అదే చేసింది. ఇంతకీ ఈ అఖిల ఎవరా అనుకుంటున్నారా?  చిన్న వయసులోనే సర్పంచ్‌ అయిన యువతి.  నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురం గ్రామానికి సర్పంచ్‌. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌కు చర్యలు తీసుకోవడంతో.. అఖిల స్వయంగా రంగంలోకి దిగి.. పహారా కాస్తోంది. మదనాపురం ఊరిలోకి వచ్చే మార్గాలను మూసివేయించింది అఖిల. రాకపోకలకు వీలు లేకుండా  రోడ్డుకు అడ్డంగా చెట్ల కొమ్మలు వేయడంతోపాటు ముళ్లకంపలు పరిచేశారు.  

దీనికి గ్రామస్థులు కూడా సహకరించడంతో ప్రస్తుతం ఈ ఊరి నుంచి ఎవరూ బయటకు పోవడం లేదు.. బయటివారిని ఊరిలోనికి రానివ్వడం లేదు. ఈ చర్యలు సరిపోవని అనుకున్నారో ఏమోగానీ.. సర్పంచ్‌గా అఖిల మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఊరిలోకి వచ్చే రహదారిపై ఎక్కడైతే ముళ్లకంపలు వేశారో.. అక్కడ  ఒక స్టూల్‌ వేసుకుని.. చేతిలో కర్ర పట్టుకుని పహారా కూడా కాస్తోంది అఖిల. ఆమె తెగువకు స్థానికుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

ఆమె ఒక్కత్తే అక్కడ ఉంటూ మదనాపురం ఊరిలోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు. తనను సర్పంచ్‌గా ఎన్నుకున్నది కేవలం పదవిని ఎంజాయ్‌ చేయడానికి కాదని చెబుతూ.. ఊరి క్షేమం.. ఊరిలోనివాని ఆరోగ్యం కూడా ముఖ్యమేనని అంటున్నారు. అఖిల ఊరికి సర్పంచ్‌గా ఉన్న.. తను ఇంకా చదువుకుంటోంది. బీటెక్‌ పూర్తి చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి. ఇళ్ల నుంచి బయటకు రాకుండా అందరినీ నేను కంట్రోల్‌ చేయలేకపోవచ్చు. కాకపోతే.. నా  గ్రామం వరకూ నేను చూసుకోగలను. అందుకే ఇక్కడ స్టూల్‌ వేసుకుని కూర్చున్నాను అని చెబుతున్నారు అఖిల.