‘ఉక్కు మనిషి’ జయంతి..

‘ఉక్కు మనిషి’ జయంతి..

సుదీర్ఘ పోరాటం తర్వాత సిద్ధించిన స్వాతంత్ర్యం అనంతరం దేశంలో ఏర్పడ్డ అనిశ్చితిని, అనైక్యతను తన చతురతతో పరిష్కరించిన భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేడు.. సామ, దాన, బేధ, దండోపాయాలతో మొత్తం 562 సంస్థానాలను విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన పటేల్.. 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు జన్మనిచ్చారు. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. 

బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. తొలి నుంచి విభజించు పాలించు విధానాన్ని అవలంభించిన ఆంగ్లేయులు మత ప్రాతిపదికన అఖండ భారతావనిని రెండు ముక్కలుగా చేశారు. అలాగే వెళ్తూ దేశంలోని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కూడా కట్టబెట్టారు. దీని ప్రకారం తమకు నచ్చితే సంస్థానాధీశులు భారత్ యూనియన్‌లో విలీనం కావచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. దీంతో సంస్థానాధీశులకు ఎక్కడలేని శక్తివచ్చింది. ఎవరికివారు జెండా ఎగరేయడం మొదలుపెట్టారు. దేశంలో ఇన్ని వేరు కుంపట్ల అయ్యాయి. ఇలా కుదరదు.. పిల్ల రాజ్యాలన్నింటి తల్లి భారతి ఒడిలో చేర్చాలి... దేశమంతా ఒక్కటిగా ఉండాలి.. ఇందుకు ఉక్కు సంకల్పం కావాలి.. అలా సంస్థానాలను దేశంలో విలీనం చేసే బాధ్యతను ‘ఉక్కు మనిషి’ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్వీకరించారు. దీనికోసం ప్రత్యేకంగా కేంద్రంల ‘రాష్ట్రాల శాఖ’ ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య భారతాన్ని పట్టిపీడుస్తున్న ఈ సమస్యను తనదైన శైలిలో పరిష్కరించి ఇండియన్ బిస్మార్క్‌గా వల్లభాయ్ పటేల్ మన్ననలు అందుకున్నారు.

1947లో స్వాతంత్రం వచ్చేనాటికి దేశంలో 565 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. వీటిలో కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ మినహా మిగిలినవి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో బేషరుతుగా ఇండియన్ యూనియన్‌లో అంతర్భాగమయ్యాయి. మిగతా మూడు సంస్థానాలను భారత్ యూనియన్‌లో విలీనం చేయడానికి పటేల్ పట్టుదలతో వ్యవహరించారు. వీటిలో ముఖ్యమైంది హైదరాబాద్ సంస్థానం. ఇందులోని 80 శాతం ప్రజలు హిందువులు, మిగతా 20 శాతం ముస్లింలు ఇతర మతాలకు చెందినవారు. ప్రపంచంలో అత్యంత ధనుకుడిగా పేరొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తమ సంస్థానానికి సొంత కరెన్సీ, రైల్వే, సైనిక వ్యవస్థలు ఉండటంతో హైదరాబాద్‌ను స్వంతంత్ర రాజ్యంగా ఉంచాలనే బలీయమైన కోరిక ఆయనది... స్వాతంత్రం ఆనంతరం మరికొంత కాలం వేచి చూసిన తర్వాత ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేస్తానని ఏడో నిజామ్ ప్రతిపాదించాడు. కానీ నిజాం వైఖరిపట్ల అనుమానంగా ఉన్న పటేల్ అందుకు అంగీకరించలేదు. ఇదే సమయంలో నిజాం సంస్థానంలోని రజాకార్లు మతకల్లోలాన్ని సృష్టించి ఆ ప్రాంతంలోని ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. నిజాం సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడానికి ఇదే సరైన సమయంగా పటేల్ భావించారు. ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్యను చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే 1947 సెప్టెంబరు 13 న ప్రారంభమైన ఆపరేషన్ మూడు రోజులు పాటు కొనసాగి అదే నెల 17 న ముగిసింది. ఇక, కశ్మీర్‌లో భిన్నపరిస్థితి.. దాని కోసమే ఆర్టికల్ 370, 35ఏ తీసుకొచ్చారు.. కాగా, ఇది భారత్‌కు కీడు చేస్తోందని భావించిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. వాటిని రద్దు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇక, ఈ నిర్ణయంతో భారత్‌లో రాష్ట్రాల సంఖ్య ఒకటి తగ్గి.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య పెరిగింది. మరోవైపు ఉక్కు మనిషి అతిభారీ విగ్రహాన్ని "స్టాట్యూ ఆఫ్ యూనిటీ" పేరుతో ఏర్పాటు చేసింది. 

ఆయనది ఉక్కు సంకల్పం అని చెప్పడానికి రెండు ఉదాహరణలు చాలు.. ఓసారి ఆయన కాలికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.. అప్పటికే రెండు శస్త్రచికిత్సలు చేయడంతో.. ఈ సారి మత్తు మందు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ఫలితం ఉండొచ్చని వైద్యులు నిర్ణయానికి వచ్చారు.. ఆ వెంటనే తాను ఎంతటి నొప్పినైనా భరిస్తా.. ఆపరేషన్ చేయండి అని చెప్పి.. ఆ ఆపరేషన్ విజయవంతం కావడానికి తన సంకల్పం ఉపయోగపడింది. మరోసమయంలో ఓ హత్య కేసులో కోర్టులో బలంగా వాదనలు వినిపిస్తున్నారు పటేల్.. వాదనలు కొనసాగిస్తున్న సమయంలో బంట్రోతు వచ్చి ఆయనకు ఓ టెలిగ్రామ్ ఇచ్చారు.. ఆ టెలికాగ్రామ్‌ను చదివేసి.. వెంటనే జేబులో పెట్టుకుని మళ్లీ వాదనలు కొనసాగించాడు. వాదనలు ముగిసిన తర్వాత ఆ టెలిగ్రామ్ పై ఆరా తీసిన జడ్జి షాక్ తినాల్సిన పరిస్థితి వచ్చింది. పటేల్ భార్య మరణించినట్టు ఆయనకు టెలిగ్రామ్ వచ్చింది.. ఆ సమయంలో వాదనలు ఎలా కొనసాగించారని జడ్జి అడిగితే.. ఆమె ఎలాగూ చనిపోయింది.. నేను తిరిగి బతికించలేను.. నా వాదనలు మధ్యలో ఆపేయకుండా కొనసాగిస్తే.. ఈ కేసులో ఉన్న వ్యక్తినైనా బతికించవచ్చు అని ఆయన ఇచ్చిన సమాధానానికి పటేల్ ఉక్కు సంకల్పానికి అంతా నిశ్చేష్టులైపోయారట.. ఇలా ఉక్కు మనిషి జీవితంలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయని చెబుతారు.