ఐదు జిల్లాల్లోనూ ఇదే సమస్య: లక్ష్మీనారాయణ

ఐదు జిల్లాల్లోనూ ఇదే సమస్య: లక్ష్మీనారాయణ

నాటు సారా, చీప్‌ లిక్కర్ల వల్ల కుటుంబాలు, గ్రామాలు సర్వనాశనమైపోతున్నాయని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలం సీతారామపురంలో అబ్దుల్‌ కలామ్‌ స్మారక గ్రంథాలయాన్ని ఇవాళ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ బెల్ట్‌ షాపులు నడుస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ఈ గ్రామంలో అందరూ మద్యం మానేస్తే సీతారామపురాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు. అనంతరం రైతులు, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర ఉండడం లేదని లక్ష్మీనారాయణ అన్నారు. ఇప్పటికి ఐదు జిల్లాల్లో పర్యటించానని.. రైతులంతా ఇదే మాట చెప్పారని అన్నారు. పనికి ఆహార పథకాన్ని వ్యవసాయ రైతులకు అనుసంధానం చేస్తే అందరికీ ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తానని హామీ ఇచ్చారు.