నేటి నుంచే ఫిఫా ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌

నేటి నుంచే ఫిఫా ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌

నేటి నుంచి రష్యాలో ఫిఫా ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ సమరం మొదలవనుంది. 32 రోజులు.. 12 మైదానాలు.. 11 నగరాల్లో ఈ ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్ సందడి ఈ రోజు నుండి మొదలుకానుంది. ఈ మహా సంగ్రామంలో ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియా జట్ల మధ్య తొలి పోరు జరుగుతుంది. అందుకుగాను సర్వం సిద్దమయింది. గురువారం లుజ్నికి స్టేడియంలో జరిగే ఆరంభ వేడుకతో ఈ ఫిఫా టోర్నీ ప్రారంభమవుతుంది. 80 వేల ప్రేక్షకుల సామర్థ్యం ఉన్న లుజ్నికి స్టేడియంలో పాటలు, నృత్యాలతో దాదాపు 500 మంది నృత్యకారులు, జిమ్నాస్ట్‌లు, ట్రాంపోలినిస్ట్‌లు అభిమానులను అలరించనున్నారు. అనంతరం ఇదే వేదికగా తొలి మ్యాచ్‌. ఫిఫా-2018 టైటిల్‌ కోసం అనేక జట్లు రేసులో ఉన్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జర్మనీ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. జర్మనీతో పాటు బ్రెజిల్‌, అర్జెంటీనా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, బెల్జియం కూడా టైటిల్  రేసులో ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో జట్లు పోటీలో నిలిచినా ఇప్పటివరకు విజేతలుగా నిలిచింది మాత్రం బ్రెజిల్‌, జర్మనీ, ఇటలీ, అర్జెంటీనా, ఉరుగ్వే ,  స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లండ్‌ మాత్రమే.

తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియాను ఎదుర్కోవడం రష్యాకు తలకు మించిన భారమే. ఈ మ్యాచ్ లో సౌదీదే ఫేవరేట్ గా కనిపిస్తోంది. సొంత అభిమానుల మధ్య ఆడుతున్న రష్యాపైనే ఒత్తిడి ఉంది. రష్యా గత 15 మ్యాచ్‌ల్లో కేవలం మూడు మ్యాచ్‌లో నెగ్గింది. అలన్‌ జగోవ్‌, డెనిస్‌ చెరిషెవ్‌, స్మొలోవ్‌లు రష్యా జట్టుకు కీలక ఆటగాళ్లు. మరోవైపు  2006 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న సౌదీ అరేబియా జట్టు ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతోంది.

ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను మించిన టోర్నీ ప్రపంచంలోనే మరొకటి లేదు. ఒలింపిక్స్‌ కూడా ఈ టోర్నీ ముందు చిన్నబోతుంది. ఈ టోర్నీ నిర్వహణతో ఫిఫాపై కాసుల వర్షం కురవనుంది. రష్యాలో జరగబోయే ప్రస్తుత ప్రపంచకప్‌ ద్వారా ఫిఫా పొందే ఆదాయం దాదాపు 6.1 బిలియన్‌ డాలర్లు(రూ.41,153 కోట్లు). ఇది ప్రపంచంలోని అందరిని ఆశ్చర్యపరిచే విషయమే. విజేతకు రూ.258 కోట్ల ప్రైజ్‌మనీ. దీన్ని బట్టే అర్ధం అవుతుంది ఫిఫాకు ఏ రేంజ్ లో ఆదరణ ఉందని. సోని టెన్‌-3, సోని టెన్‌2, సోనీ ఈఎస్‌పీఎన్‌ల్లో ఆరంభోత్సవం, మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. మ్యాచ్‌ ఆరంభానికి అరగంట ముందు ప్రారంభ వేడుక మొదలవుతుంది. భరత్ కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. 

Photo: FileShot