ట్రంప్ లేఖలో తప్పులు..!!

ట్రంప్ లేఖలో తప్పులు..!!

సర్వీసులో ఉన్నంతకాలం విద్యార్థులు రాసిన పరీక్షలను దిద్దడమే పనిగా పెట్టుకున్న టీచర్‌.. రిటైర్ అయిన తర్వాత కూడా ఎవరైనా తప్పుగా రాసినట్లు కనిపిస్తే వదులుతారా.. తక్షణం పెన్ను తీసుకుని ఎక్కడ తప్పు చేశాడో అండర్‌లైన్ చేసి మరి చెబుతూ ఉంటారు. అలాంటి ఒక ఇంగ్లీష్ టీచర్‌కు తప్పుగా రాసిన ఒక లెటర్ కనిపించింది. ఇంకేముంది వెంటనే దిద్దడం మొదలేట్టిసింది. అయితే అది ఎవరిదో అలాంటి ఇలాంటి వ్యక్తిదో.. చిన్న పిల్లాడిదో కాదు. కనుసైగతో ప్రపంచాన్ని శాసించగల అమెరికా అధ్యక్షుడి లెటర్..

వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో ఓ ఉన్మాది కాల్పుల్లో 17 మంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనను చూసి చలించిపోయిన వ్యోన్ మాసోన్ అనే రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్.. బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన వైట్ హౌస్ ఆమెకు ప్రత్యుత్తరం పంపింది. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. త్వరలోనే అందరితో సమావేశం నిర్వహించి.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామంటూ లెటర్‌లో పేర్కొన్నారు. అయితే ఆ లేఖలో అక్షర దోషాలు, గ్రామర్ తప్పులు ఉండటంతో చిర్రెత్తుకొచ్చిన మాసోన్ స్వతహాగా ఇంగ్లీష్ టీచర్ కావడంతో.. వెంటనే పెన్ను తీసుకుని దోషాలను సరిదిద్ది తిరిగి వైట్‌హౌస్‌కు పంపారు. అంతేకాకుండా దానిని ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.