హాస్యానికి నిలువెత్తు రూపం అల్లు రామలింగయ్య

హాస్యానికి నిలువెత్తు రూపం అల్లు రామలింగయ్య

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్న తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నవారు కొంతమందే ఉంటారు వారిలో అల్లు రామలింగయ్య ఒకరు. హాస్యం అనే పదం వినగానే అల్లు రామలింగయ్య టక్కున గుర్తొస్తారు. అంతలా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు ఆయన. ద‌శాబ్ధాల కాలం పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న హాస్యంతో న‌వ్వులు పువ్వులు పూయించారు. ఆయ‌న ఎలాంటి పాత్ర పోషించిన అంత‌ర్లీనంగా హాస్యం దాగి ఉంటుంది. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్ర‌ల‌తో, ఆ తరువాత ఎన్నో వందల చిత్రాల్లో తన హాస్యంతో నటవిశ్వరూపం చూపించారు. కేవలం హాస్యం మాత్రమే కాదు  సెంటిమెంట్ స‌న్నివేశాల్లో…..విల‌న్ పాత్ర‌ల్లో త‌న‌దైన శైలిలో ద‌శాభ్ధాల కాలం పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.అల్లు రామలింగయ్య ఏం చేసినా? అది నవ్వులు పూయించడం రివాజయింది. 
1929 అక్టోబర్‌ 1వ తేదీన పాలకొల్లుకు చెందిన అల్లు వెంక య్య, వీరమ్మలకు రామలింగయ్య ప్రథమ సంతానంగా జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరిలు ఉన్నారు. రామలింగయ్య చదువుల్లో పెద్దగా రాణించకపోవడంతో చిన్నతనంలోనే కొబ్బరి కాయల నాడెం చేయడంతో జీవితాన్ని ప్రారంభించారు. గాంధీజీ సిద్దాంతాల పట్ల ఆకర్షితుడై స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. పాలకొల్లులో రైలుపట్టాలు తొలగించిన కేసులో జైలు జీవితం అనుభవించారు. అనంతరం కమ్యూనిస్టు భావజాలంతో ఆ పార్టీలో చేరారు.16వ ఏట భక్త ప్రహ్లాద వీధి నాటకంలో బృహస్పతి పాత్రతో రంగస్ధల ప్రవేశం చేశారు. పరకాల శేషావతారం రాసిన కూడూ-గుడ్డ నాటకంలో ఆచారి పాత్రను, ప్రజానాట్య మండలి డాక్టరు రాజారావు దర్శకత్వంలో ఆ పాత్రను అద్భుతంగా పోషించారు.  ఈ నాటకం నటుడిగా రామలింగయ్యకు మంచి గుర్తింపు తెచ్చింది .1952లో ప్రముఖ సినీ దర్శకుడు రాజారావు నిర్మించిన పుట్టిల్లు సినిమాలో రామలింగయ్య తొలిసారిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో పురోహితుడు పాత్రతో ఆయన మెప్పించారు. రామలింగయ్య వెయ్యికి పైగా చిత్రాలను పూర్తి చేయడం ఓ రికార్డుగా చెప్పుకోవాలి. సుమారు 1200 సినిమాల్లో నటించిన రామ లింగయ్యకు ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. స్వయంగా సరస్వతి నాట్యమండలిని స్థాపించి పలు నాటక ప్రదర్శనలు ఇచ్చారు. 73 ఏళ్ళ వయసులో 2004 జూలై 31వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. 2013లో అల్లు రామలింగయ్య పేరుమీద  భారత ప్రభుత్వం పోస్టల్‌ స్టాంపు విడుదల చేసి మరింత గౌరవించింది.