ఆస్ట్రేలియా ప్రధానితో మోడీ వీడియో కాన్ఫరెన్స్ వెనుక అసలు ఉద్దేశ్యం ఇదేనా? 

ఆస్ట్రేలియా ప్రధానితో మోడీ వీడియో కాన్ఫరెన్స్ వెనుక అసలు ఉద్దేశ్యం ఇదేనా? 

కష్టాలు ఎదురైనపుడే మనిషి యొక్క సమర్ధత ఏంటి అన్నది తెలుస్తుంది.  మనిషి కావొచ్చు సమాజం కావొచ్చు వ్యవస్థ కావొచ్చు లేదా దేశం కావొచ్చు.  విపత్తులు, కష్టాలు ఎదురైనపుడు ఆ దేశ నాయకులు తీసుకునే నిర్ణయాలను బట్టి, దౌత్యం బట్టి ఆ దేశం యొక్క భవిష్యత్తు, అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ బలంగా నమ్ముతున్నారు.  కరోనా మహమ్మారి దేశంలోని ప్రవేశించి విలయతాండవం చేస్తున్న సమయంలో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది.  ప్రజారోగ్యం దెబ్బతిన్నది.  రెండింటిని కాపాడుకోవాలి.  ఇదే సమయంలో ఇండో చైనా బోర్డర్ లో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.  ఇండియా చైనా మధ్య ప్రస్తుతం ఎకనామిక్ వార్ జరుగుతున్నది.  చైనా వస్తువులను ఇప్పటికే చాలా చోట్ల బ్యాన్ చేశారు.  

చైనా యాప్ లను మొబైల్ ఫోన్ ల నుంచి తొలగిస్తున్నారు. గో లోకల్ వోకల్ కార్యక్రమానికి రూపకల్పన చేసి, పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు ఆర్ధిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది.  ఇది చైనాకు చాలా ఇబ్బందిగా మారింది.  అంతేకాదు,  చైనా ల్యాబ్ లోనే వైరస్ ను సృష్టించారు అని నమ్మే దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి.  ఆ దేశ ప్రధాని ఈ విషయాన్ని బాహాటంగా ప్రకటించారు.  చైనాపై అమెరికా చేస్తున్న వాదనకు సపోర్ట్ చేసింది ఆస్ట్రేలియా.  దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యం సంపాదించాలని చూస్తోంది.  దక్షిణ చైనా సముద్రంలో ఇప్పటికే కొన్ని దీవుల్లో నావెల్ బేస్ లను ఏర్పాటు చేసుకుంటోంది చైనా.  అయితే, దీనిని దక్షిణ కొరియా, వియాత్నం, జపాన్ దేశాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ మూడు దేశాలతో ఇండియాకు మంచి సంబంధాలు ఉన్నాయి.  ఇప్పుడు ఆస్ట్రేలియాతో బలమైన మైత్రిని నెలకొల్పేందుకు ఇండియా సిద్ధం అయ్యింది.  

ఇండో... పసిఫిక్ జలాలపై ఇండియా పట్టు సాదించాలి అంటే ఆస్ట్రేలియా సపోర్ట్ చాలా అవసరం.  పైగా చైనాపై ఆస్ట్రేలియా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.  దీంతో ఆస్ట్రేలియాతో బలమైన మైత్రిని పెంచుకుంటే చైనాకు వ్యతిరేకంగా రేపు పోరాటం చేయాల్సి వచ్చినపుడు ఆస్ట్రేలియా సహకారం తప్పకుండా ఉంటుంది.  ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా ప్రధానితో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు.  త్వరలోనే ఇండియాకు సందర్శించాలని కోరారు.  కోవిడ్ తరువాత తప్పకుండా ఇండియాకు వస్తానని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరీసన్ చెప్పినట్టు తెలుస్తోంది.