రాజ‌స్థాన్‌లో సీన్ రివ‌ర్స్‌...! కాంగ్రెస్‌తో ట‌చ్‌లోకి బీజేపీ ఎమ్మెల్యేలు..?

రాజ‌స్థాన్‌లో సీన్ రివ‌ర్స్‌...! కాంగ్రెస్‌తో ట‌చ్‌లోకి బీజేపీ ఎమ్మెల్యేలు..?

రాజ‌స్థాన్ రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది.. ఓవైపు త‌న‌కు 30 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉందంటూ కాంగ్రెస్ తిరుగుబాటు నేత‌, డిప్యూటీ సీఎం స‌చిన్ పైలెట్ చెబుతుండ‌గా..  సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోనే కాంగ్రెస్ సర్కారుకు వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేద‌ని.. త‌మ ప్ర‌భుత్వానికి మెజార్టీ ఉందని చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేత‌లు. తన మద్దతుదారులతో కలిసి సచిన్ పైలెట్ హ‌స్తిన‌కు వెళ్తే.. సీఎం అశోక్ గెహ్లాట్... జైపూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ బేటీ ముగిసి‌న త‌ర్వాత... గెహ్లాట్ వర్గానికి చెందిన రాజేందర్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి మెజార్టీ ఉంద‌ని.. తమతో బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అవసరమైతే బీజేపీ ఎమ్మెల్యేల ఓట్లతోనైనా త‌మ స‌ర్కార్ గ‌ట్టెక్కుతుంద‌నే ధీమా వ్యక్తం చేశారు. రేప‌టి స‌మావేశానికి అంద‌రు ఎమ్మెల్యేల‌ను తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని తెలిపారు. 

మ‌రోవైపు.. జైపూర్‌లోని గెహ్లాట్ నివాసంలో సోమ‌వారం ఉద‌యం సీఎల్‌పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంతమంది ఎమ్మెల్యేలు హాజ‌ర‌వుతార‌నే విష‌యంపై ఉత్కంఠ నెల‌కొంది.. ఇక‌, కాంగ్రెస్ అధిష్టానం నుంచి కొంత మంది పెద్ద‌లు కూడా రంగ‌ప్ర‌వేశం చేసి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.. కాగా, రాజ‌స్థాన్ అసెంబ్లీలో 200 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా.. కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంది.. ఇక‌, 11 మంది ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలకు చెందిన ముగ్గురు గెహ్లాట్ సర్కారుకు మద్దతిస్తున్నారు. ఇదిలా ఉంటే.. 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరికొందరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు తనతో ట‌చ్‌లో ఉన్నార‌ని.. వారి మ‌ద్ద‌తు త‌న‌కే అంటున్నారు సచిన్ పైలెట్.. దీంతో.. గెహ్లాట్ సర్కారు మైనార్టీలో ప‌డిపోయిందంటున్నారు. ఢిల్లీలో మ‌కాం వేసిన స‌చిన్.. త‌న మిత్రుడు, బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాతో స‌మావేశం కావ‌డం చ‌ర్చ‌గా మారింది.. ఆయ‌న బీజేపీ గూటికి చేర‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ సాగుతోంది.. ఇలా ఎవ‌రి లెక్క‌లు వారు వేసుకుంటున్నారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు గాలం వేసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు సాగిస్తుండ‌గా.. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని కాంగ్రెస్ చెబుతోంది.. దీంతో.. రాజ‌స్థాన్ రాజ‌కీయం ఉత్కంఠరేపుతోంది.