అక్కడ బెడ్‌ కావాలంటే మంత్రి చెప్పాల్సిందేనా?

అక్కడ బెడ్‌ కావాలంటే మంత్రి చెప్పాల్సిందేనా?

కరోనా  కార్పొరేట్‌ ఆస్పత్రులకు కాసులు వర్షం కురిపిస్తోంది. ఈ విపత్తును తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నాయి ప్రైవేట్‌ ఆస్పత్రులు. పాజిటివ్‌ అని తేలినా.. లక్షణాలు ఉన్నా.. అన్నింటినీ ఒకే గాటన కట్టేస్తున్నారు. కరోనా రోగిగానే పరిగణిస్తూ.. బాధితులను అడ్మిట్‌ చేసుకుని లక్షల్లో బిల్లులు వేస్తున్నారు. మరోవైపు - బిల్‌ ఎంతైనా పర్వాలేదు.. బెడ్‌ ఇవ్వండి అంటే మాత్రం ఈజీగా దొరికే పరిస్థితి లేదు. 

అధికారికంగా 55 ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా కోసం చాలా బెడ్లను కేటాయించారు. కానీ.. అక్కడి పరిస్థితులను చూసి జంకుతున్న జనం ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యానికే మొగ్గు చూపిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం 248 జీవో విడుదల చేసింది. ఏ చికిత్సకు ఎంతో రేటు ఫిక్స్‌ చేసింది. కానీ.. ప్రభుత్వ ఆదేశాలతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి కార్పొరేట్‌ ఆస్పత్రులు.  మా ఆస్పత్రి మా బిల్‌ అన్న చందంగా మారిపోయింది. ఇప్పటికే అధికారికంగా 55 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ జరుగుతోంది. అనధికారికంగా చాలా ఆస్పత్రుల్లో సేవలు మొదలయ్యాయి. ఒక్కో ఆస్పత్రిలో 50 బెడ్ల నుంచి 300 ల బెడ్లలో కరోనా చికిత్స చేసే సౌలభ్యం ఉంది. 

మంత్రులు చెబితేనే బెడ్స్‌ ఇస్తున్నారా?

అయినప్పటికీ మంత్రి, పలుకుబడిన ఎమ్మెల్యే లేదా ప్రభుత్వంలో టాప్‌ పొజిషన్‌లో ఉన్న అధికారులు ఎవరితోనైనా రికమండేషన్‌ చేయిస్తేనే బెడ్‌ కేటాయిస్తున్నారట. ప్రతి ప్రైవేట్‌ ఆస్పత్రికి ఎవరో ఒకరు మంత్రి, రాజకీయ నాయకులు అండగా ఉంటున్నారని సమాచారం. అలాంటి ఆస్పత్రుల్లో ఆ మంత్రులు చెబితేనే బెడ్స్‌ ఇస్తున్నట్లు సమాచారం. ఇది తెలుసుకున్న కొందరు ఆయా మంత్రుల చుట్టూ తిరుగుతుంటే.. తెలియనివారు కార్పొరేట్‌ ఆస్పత్రులు ఏం చెబితే అది నమ్మి ఉసూరుమంటూ వెళ్లిపోతున్నారు. 

రోజూ వేల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు!

తెలంగాణలో రోజూ వేల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. వీరిలో కొందరు ఆస్పత్రిలో.. మరికొందరు ఇంటిలో ఉండి చికిత్స చేసుకుంటున్నారు. ఇలా ఇళ్ల దగ్గర  ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నవారికి ఏదైనా అత్యవసరమై ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్తుంటే వెనక్కి పంపేస్తున్నారట. ఇలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కడా బెడ్స్‌ దొరక్క ఎవరూ పట్టించుకోక చాలా మంది రోడ్లపైనో.. అంబులెన్స్‌లోనో ప్రాణాలు వదిలిన ఘటనలు చూస్తున్నాం. 

మంత్రులకు 3, 4 బెడ్స్‌ ప్రత్యేకంగా కేటాయింపు?

ప్రస్తుతం కార్పొరేట్‌ ఆస్పత్రుల నుంచి సాధారణ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఒక్కోచోట మంత్రులకు మూడు నాలుగు బెడ్స్‌ ప్రత్యేకంగా కేటాయించేశారట. ఆ బెడ్స్‌ను ఎవరికి ఇవ్వాలో  నిర్దారించేది మంత్రులేనని చెబుతున్నారు. మంత్రి లేదా ఆ మంత్రి పీఏ  ఫోన్‌లో ఎవరి పేరు చెబితే వారికే బెడ్‌ కేటాయిస్తున్నట్లు  కథలు కథలుగా అధికార పార్టీలోనూ.. అధికార వర్గాల్లోనూ చెప్పుకొంటున్నారు. అయితే ఈ విధానంలో మంత్రులు రోగులకు అండగా ఉన్నారో.. కార్పొరేట్‌ ఆస్పత్రుల దందాకు హెల్ప్‌ చేస్తున్నారో అర్థం కావడం లేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 

తమ వారి కోసమే ముందుగా బెడ్స్‌ బుక్‌ చేసుకున్నారా?

అయితే కరోనా విజృంభిస్తున్న వేళ తమవారికి ఎవరికైనా అవసరమైతే దొరకవేమోనని ముందుగానే బుక్‌ చేసుకుని ఉంచుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏది ఏమైనా.. కరోనా కాలంలో ఆపన్నులకు అండగా ఉండాల్సిన కార్పొరేట్ ఆస్పత్రులు, మంత్రులు ఈ విధంగా ప్రైవేట్‌ దందాకు గేట్లు ఎత్తడం విమర్శలకు దారితీస్తోంది.