ప్రీతీజింతా, సెహ్వాగ్ మ‌ధ్య విభేదాలు!

ప్రీతీజింతా, సెహ్వాగ్ మ‌ధ్య విభేదాలు!

ఐపీఎల్.. క్రికెట్‌కు కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించి అభిమానులను అలరిస్తున్న టోర్నీ. ఒకప్పుడు బోర్డు, కోచ్‌, కెప్టెన్‌, ఆటగాళ్లకే పరిమితమైన ఆట వ్యవహారాలు.. ఐపీఎల్‌ రాకతో పూర్తిగా మారిపోయాయి. ఈ టోర్నీలో ప్రతి ఫ్రాంఛైజీకీ యజమానులుంటారు. జట్టులో ఆటగాళ్ల ఎంపికే కాకుండా మ్యాచ్‌ల వ్యవహారాల్లో కూడా వీరు వేలుపెడుతంటారు. ముఖ్యంగా.. ఓనర్స్‌గా ఉన్న సినిమా స్టార్స్‌.. ఈ విషయంలో కాస్త ముందున్నారనే చెప్పాలి. కోల్‌కతా జట్టు యజమాని షారుఖ్‌, పంజాబ్‌ జట్టు యజమాని ప్రీతి జింతా.. తమ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కీ హాజరై స్టేడియంలో కలియతిరుగుతుంటారు.

తమ జట్టు గెలిస్తే ఫర్వాలేదు..లేకుంటే అసహనానికి గురువుతుంటారు. కొన్ని సార్లు నోరుపారేసుకుంటారు. దీంతో విభేదాలు మొదలవుతాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే పంజాబ్‌ జట్టు యజమాని ప్రీతీజింతా, మెంటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మధ్య జరిగినట్టు తెలుస్తోంది.  ఇటీవ‌ల రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స్వల్ప స్కోరును ఛేదించ‌లేక చేతులెత్తేసిన పంజాబ్ ఆట‌గాళ్ల తీరు ప్రీతీ జింతాకు కోపం తెప్పించింద‌ట‌.

కరుణ్‌ నాయర్‌, మనోజ్‌ తివారీని కాదని సారథి రవిచంద్రన్‌ అశ్విన్‌ను మూడో స్థానంలో పంపించడంపై మెంటర్‌ సెహ్వాగ్‌పై ప్రీతి ఆగ్రహం వ్యక్తం చేసిందట. దీంతో జ‌ట్టు బాధ్యతల నుంచి త‌ప్పుకోవ‌డం ఉత్తమమని సెహ్వాగ్ భావిస్తున్నట్టు తెలిసింది. ప్రీతి తనను ప్రశ్నించడంపై సెహ్వాగ్‌ ఫ్రాంఛైజీ యాజమాన్యం నెస్‌ వాడియా, మోహిత్‌ బుర్మాన్‌కు ఫిర్యాదు చేశాడట. ప్రీతి ఎక్కువగా తన వృత్తిలో కలగజేసుకుంటోందని, తాను ఎంచుకున్న తుది జట్టుపై పలుమార్లు సందేహాలు వ్యక్తం చేసింది వారికి వివరించినట్టు తెలిసింది. పంజాబ్‌ సెహ్వాగ్‌ను వదులుకోవడం జరిగితే ఆ జట్టుకు కష్టమే మరి.