ఒక్క‌రోజు కలెక్టర్ ఆఫ‌ర్‌.. వ్యాపారుల మైండ్‌ బ్లాంక్..‌!

ఒక్క‌రోజు కలెక్టర్ ఆఫ‌ర్‌.. వ్యాపారుల మైండ్‌ బ్లాంక్..‌!

కలెక్టర్‌ కావాలంటే  సివిల్స్‌ పాస్‌ కావాలి. మంచి ర్యాంక్‌ రావాలి. అప్పుడే పేరు పక్కన ఐఏఎస్ వస్తుంది.. కలెక్టర్‌గా పనిచేసే ఛాన్స్‌ లభిస్తుంది. కానీ..  కష్టపడి ఐఏఎస్ చదవకుండానే ఒక్కరోజు కలెక్టర్‌గా పనిచేసే అవకాశం ఇస్తానంటున్నారు ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌. కలెక్టర్‌ ఇచ్చిన ఈ ఆఫర్‌పై అన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఆయన ఇచ్చిన ఆఫర్‌పై ఆరా తీస్తున్నారు జనం. అయితే, తనకంటే గొప్పగా ఎవరైనా పని చేస్తానని ముందుకు వస్తే.. ఒక్కరోజు కలెక్టర్‌ని చేస్తానని భాస్కర్‌ అంటున్నారు. కలెక్టర్‌ ఈ విధమైన ఆఫర్‌ ప్రకటించానికి దారితీసిన పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చర్చించుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. జిల్లాలో ఇప్పటికే 1700 మంది వైరస్‌ బారిన పడ్డారు. 

పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ఒంగోలు, చీరాల, కందుకూరు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరులో ఆంక్షలు పెట్టారు. ఒంగోలులో గత నాలుగు నెలలుగా బిజినెస్‌ లేక ఇబ్బంది పడుతున్న వ్యాపారులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారట. దీంతో వ్యాపారుల ఇబ్బందులు పరిశీలించాలని మంత్రి.. కలెక్టర్‌ భాస్కర్‌కు సూచించారట. ఇంకేముంది మంత్రిగారు చెప్పారని ఆయన వ్యాపారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాపారులు ఎవరి ఇబ్బందులు వారు కలెక్టర్‌ భాస్కర్‌ ముందు ఏకరవు పెట్టారు. కరోనాపై ఎవరూ పట్టనట్లు మాట్లాడారట. వ్యాపారుల వెల్లడించిన అంశాలు విన్న తర్వాత .. కలెక్టర్‌ సైతం వారి స్టయిల్లోనే స్పందించారట. కేసుల కట్టడి అంత ఈజీగా ఏం లేదని.. మీలో ఎవరైనా ఒక్కరోజు సీఎంలా.. ఒక్కరోజు కలెక్టర్‌గా పనిచేసి చూడండి.. మీకూ సమస్య అర్థమవుతుంది అని క్లాస్‌ పీకారట. ఎవరైనా సరే నా కంటే గొప్పగా పనిచేస్తానని అనుకుంటే ఒక్కరోజు కలెక్టర్‌ను చేస్తానని వ్యాపారులకు ఆఫర్‌ ఇచ్చారట భాస్కర్‌. దీంతో మీటింగ్‌కు వెళ్లిన వ్యాపారులకు కలెక్టర్‌ ఇచ్చిన క్లాస్‌తో మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందట.