ప్రజా బాటసారి

ప్రజా బాటసారి

ఎంతమార్పు....

నాలుగేళ్లలో వైసీపీ అధినేత జగన్ లో ఊహించని మార్పు కనిపిస్తోంది. పూర్తిగా పరిణతి చెందిన రాజకీయ వేత్తగా ఎదిగారాయన. ప్రజాసంకల్ప యాత్రలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మండుటెండను సైతం లెక్కచేయకుండా ఆయన నడుస్తున్నారు.  యాత్రలో అడుగడుగునా జనం నీరాజనం అందుకుంటున్నారు. ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారు. రాజకీయ నాయకుడికి ప్రజాదర్బారులో విశ్వసనీయత ఎంతో ముఖ్యం. ప్రజల విశ్వాసాన్ని పొందితే... ఎంతటి బలమున్న పక్షమున్నా... ఏమీ చేయలేదు. జనంతో కలిసుండే నేతను ప్రజలు అక్కున చేర్చుకుంటారు. జగన్... తండ్రి నుంచి అలాంటి లక్షణాలను పుణికి పుచ్చుకున్నారనే అభిప్రాయం జనంలో ఉంది. ప్రజల ఈతిబాధలు వింటూ... వారిని ఓదార్చుతూ... ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. 

నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోడానికి నడచివస్తుంటే జననేతకు పల్లెలన్నీ ఎదురొచ్చి స్వాగతిస్తున్నాయి. మెండైన ఆత్మవిశ్వాసంతో అలుపెరుగని ఆయన అడుగులు... చరిత్రను ప్రభావితం చేస్తున్నాయి. అడుగులో అడుగు వేసుకుంటూ జనం జగన్ కు బాసటగా నిలుస్తున్నారు. కష్టాలు, కన్నీళ్లలో తోడు ఉంటానంటూ జననేత వారికి భరోసా ఇస్తున్నారు. పాదయాత్రతో పాటు జగన్‌ సభలకు జనం పోటెత్తుతున్నారు. రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. అండగా తామున్నామంటూ రాజన్న బిడ్డపై అభిమానాన్ని కురిపిస్తున్నారు. భవిష్యత్ సీఎం అంటూ నినదిస్తున్నారు. జనం కోసం జగన్‌ ..... జగన్ కోసం జనం అంటూ ఈ యాత్ర సాగుతోంది. అడుగడుగునా... చంద్రబాబు తప్పులను ఎండగడుతూ నడుస్తున్నారు. 

జగన్ వేసే ప్రతి అడుగులో జనం అప్యాయత, మద్దతు కనిపిస్తోంది. అడుగడుగునా ప్రజలు చూపించే ఆత్మీయతకు జగన్ ఉబ్బితబ్బిబవుతున్నాడు అనటానికి మీడియాలో వస్తున్న ఫోటోలు సాక్ష్యం. రైతులు, రైతు కూలీల, కార్మికులు, కుల వృత్తుల వారిని కలుస్తూ... వారి సాదక బాధకాలను వింటున్నారు. తమ ప్రభుత్వం వస్తే బాధలు తీరుస్తానంటూ హామీ ఇస్తు ముందుకు సాగుతున్నారు. ఆటో నడుపుతూ ఆ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మత్య్చకారులతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. సరదాగా చెరువులో చేపలు పట్టారు. 

జనాధరణ... జగన్ ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. ప్రజాసంకల్ప యాత్ర మొదలు కాగానే ప్రజల నుంచి వచ్చిన స్పందన అపూర్వం. ఆయన అడుగులో అడుగు కలుపుతూ, జగన్ బాటలో అశేష ప్రజావాహిని కదిలింది. ఇందుకు సాక్ష్యం ఆయన పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించగానే ... ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రకాశం బ్యారేజీపైకి వచ్చిన జనమే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... ప్రజలు వెన్నంటి ఉండటంతో ధీమాగా నడుస్తున్నారు జగన్. మొదటి నుంచి తన పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు. ఏ వర్గం నుంచి విమర్శలు లేకుండా జాగ్రత్తపడుతున్నారు. 

బహిరంగ సభల్లో కూడా పరిణతి చెందిన రాజకీయ నేతగా తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టి పెట్టుకుని ప్రసంగాలు సాగుతున్నాయి. నవరత్నాలతో పాటు ప్రజలకు కావాల్సినవేమిటో పాదయాత్రలో అడిగి తెలుసుకుని వాటిని మేనిఫెస్టోలో చేర్చే ఏర్పాట్లు చేస్తున్నారు. పీకే టీమ్ కూడా ఎప్పటికప్పుడు ఆయనకు సలహాలు ఇస్తోంది. ఇంతవరకు సాగిన 2వేల కిలోమీటర్ల యాత్ర లో ఎలాంటి విమర్శలకు తావులేకుండా చూసుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో ఉంటునే.... పార్టీ వ్యవహారాలు కూడా చక్కదిద్దుతున్నారు. ఎప్పటికప్పుడు వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో జగన్ వ్యూహమే ఇందుకు ఉదాహరణ. పార్టీని మరింత బలోపేతం చేయటానికి కొత్త వారిని ఆహ్వానించటం కూడా చేస్తున్నారు. మరోవైపు... జనసేన నేత పవన్ కూడా కవాతు పేరుతో రాష్ట్ర్రాన్ని చుట్టేసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తన వ్యూహాన్ని ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. 

ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన  ప్రజాసంకల్ప యాత్రలో జనం సమస్యల్నితెలుసుకోవటమే ప్రధాన అజెండ. ప్రతి జిల్లాలో ఐదు నియోజకర్గాల్లో మొత్తం 13 జిల్లాల్లో పాదయాత్ర కొనసాగేలా ప్లాన్ చేశారు. రోజుకు సుమారు 15కిలోమీటర్లు నడుస్తున్నారు జగన్.