వాడుకొని వదిలేయడంలో కేసీఆర్ దిట్ట

వాడుకొని వదిలేయడంలో కేసీఆర్ దిట్ట

వాడుకొని వదిలేయడంలో కేసీఆర్ దిట్ట అని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఈ రోజు పొన్నం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...  కేసీఆర్ నియంత  వైకరిలాగా మాట్లాడుతున్నారన్నారు. ఆర్టీసి కార్మికులను బెదిరించే విధంగా కేసీఆర్ మాట్లాడారని తీవ్రంగా ఖండించారు. ఆర్టీసి కార్మికులు అంటే కేసీఆర్ కు, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డికి పట్టింపు లేదు అని విమర్శించారు. రిటైర్డ్ అయిన రమణారావును బంధుత్వం ఉండడం వల్ల కేసీఆర్ ఆర్టీసి ఎండీగా కొనసాగిస్తున్నారు అని ఎద్దేవా చేసారు. కార్మికులు సమ్మె చేస్తానంటే చేసుకపో అని బెదిరిస్తావా అని కేసీఆర్ పై మండిపడ్డారు. అందరిని వాడుకొని వదిలేయడంలో కేసీఆర్ దిట్ట అని పేర్కొన్నారు.

ఆర్టీసి గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షుడిగా హరీష్ ఉండడం వల్లే కేసీఆర్ కి కోపం. కేటీఆర్, కవితను గౌరవ అధ్యక్షుడిగా పెట్టుకుంటే ఎలాంటి సమస్య ఉండదన్నారు. 44 శాతం ఫిట్మెంట్ కార్మికులు పోరాటం చేస్తే.. ఇచ్చారు అని గుర్తుచేశాడు. కేసీఆర్ ముందు పాలాభిషేకం చేస్తేనే.. ఆర్టీసి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాడన్నారు. ఆర్టీసిని ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పిన  కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ఇంతవరకు అమలుచేయలేదన్నారు. కేసీఆర్ కు ఆర్టీసి కార్మికులు రానున్న ఎన్నికల్లో బుద్ది చెప్పాలి అని సూచించారు. ఉద్యోగుల కోసం ఉన్న ట్రిబ్యునల్ ను ఎందుకు ఎత్తివేసారు అని ప్రశ్నించారు. ఉద్యోగుల సంఘ నాయకులు  కేసీఆర్ కు తొత్తులుగా మారి పదవుల కోసం ఆరాటపడుతున్నారన్నారు. కేసీఆర్ చెంచాలతో మీటింగ్ పెట్టుకున్నారు.. జిల్లాల నుండి వచ్చిన ఉద్యోగులను సమావేశానికి ఆహ్వానించాలేదు అని విమర్శించారు. కేసీఆర్ కు తాబేదారులుగా మారిన ఉద్యోగసంఘ నాయకులు ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే అని పేర్కొన్నారు. మీ సంఘాలను ముసుకోండి అని అన్నారు. ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వానికి భజన చేస్తుందన్నారు. కొందరి ఉద్యోగులకు మాత్రమే బదిలీలు ఎందుకు చేశారు అని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలను, బదిలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల పక్షాన కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.