ఏకంగా పోలీస్ జీపునే చోరీ చేశాడు...

ఏకంగా పోలీస్ జీపునే చోరీ చేశాడు...

పోలీసుల జీపునే అపహరించి అడ్డంగా బుక్కయ్యాడు ఓ యువకుడు. సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనతో అంతా అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ జిల్లా యంత్రాంగం నాలుగు గంటల్లోనే జీపును... అపహరించిన దొంగను పట్టేసుకున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ప్రకాశ్‌ జాదవ్‌ మాట్లాడుతూ... సూర్యాపేట గ్రామీణ సీఐ ప్రవీణ్‌కుమార్‌ శనివారం సాయంత్రం జిమ్ కు వెళ్లారని... ఓ గుర్తు తెలియని వ్యక్తి... వాహనంలో కూర్చున్న డ్రైవర్‌ సైదులుకు సీఐ పిలుస్తున్నారంటూ అతని దృష్టిని డైవర్ట్ చేసి  వాహనాన్ని తీసుకొని పరారయ్యాడని తెలిపారు. అయితే వెంటనే ఆ డ్రైవర్‌ ఆ దొంగ విడిచి వెళ్లిన ద్విచక్రవాహనంతో వెంబడించాడు. అతివేగంతో సద్దుల చెరువు కట్ట మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకొని కోదాడ వైపు దూసుకెళ్లాడు.

వెంటనే అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం వాహనం చోరీకి గురైన సుమారు 4గంటల్లోనే పోలీసులు సీసీ కెమేరాల సాయంతో నిందితుడిని పట్టుకున్నారు. చోరీకి పాల్పడ్డ వ్యక్తి సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన తిరుపతి లింగరాజుగా గుర్తించారు. అతుడు దొంగిలించిన వాహనాన్ని మునగాల, కోదాడ మీదుగా ఖమ్మం జిల్లాలోకి చేరవేసినట్లు తెలిపారు. అక్కడ నుంచి నిందితుని భార్య అఖిల సొంతూరైన ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురానికి లింగరాజు వెళ్లాడు. అక్కడే మరో నలుగురిని ఆ జీపులో ఎక్కించుకుని ఆంధ్రప్రదేశ్‌ వైపు వెళ్తుండగా.. కృష్ణా జిల్లా చిల్లకల్లు చెక్‌పోస్టు వద్ద పోలీసులు.. నిందితుడుని.. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే తనభర్త మానసికస్థితి బాగాలేదని అతని భార్య తెలిపినట్లుగా ఎస్పీ వెల్లడించారు.