విజయవాడలో స్పాల మాటున వ్యభిచారం ఎవరి కనుసన్నల్లో జరుగుతోంది?

విజయవాడలో స్పాల మాటున వ్యభిచారం ఎవరి కనుసన్నల్లో జరుగుతోంది?

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని అంటారు. ఆ సిటీలో కూడా ఇంటి దొంగలే పడ్డారట. అసాంఘీక కార్యకలాపాలకు పెద్ద పీట వేస్తూ.. నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారట. పైగా మా బాస్‌కు చెప్పేశాం.. ఎలాంటి ఇబ్బంది లేదని ప్రచారం చేసుకోవడంలో ఆరితేరిపోయినట్లు చెబుతున్నారు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

దాడులు చేస్తున్నా.. స్పాలలో ఆగని వ్యభిచారం!

రాజధాని నగరంగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బెజవాడలో అసాంఘీక కార్యకలాపాలు, అక్రమార్జనకు పాల్పడే ముఠాలు దండ యాత్రలు చేస్తూనే ఉన్నాయి. డ్రగ్స్‌, గంజాయి ముఠాలే కాకుండా స్పాల ముసుగులో వ్యభిచారం నిర్వహించే వారు ఎక్కువయ్యారు. ఈ ఐదేళ్ల కాలంలో చిన్నా పెద్దా కలిపి విజయవాడ పరిధిలో 250కిపైగా స్పాలు ఏర్పాటయ్యాయి. ప్రత్యేక లైటింగ్‌ వ్యవస్థ, దేశ విదేశాలకు చెందిన యువతులే ప్రధాన ఆకర్షణగా వ్యాపారం సాగిస్తున్నారు. ఒకసారి ఈ స్పాలలోకి అడుగుపెడితే క్రాస్‌ మసాజ్‌ పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పలుమార్లు పోలీసుల దాడుల్లో గుర్తించారు. అయితే పోలీసులు దాడులు చేస్తున్నా.. స్పాలలో ఈ దందా కొనసాగుతుండటం పోలీస్‌ వర్గాల్లోనే ఆసక్తికర చర్చ జరుగుతోందట. 

మరో పేరుతో తెరుచుకోవడం మామూలైపోయిందా?

స్పాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసినప్పుడు బ్యాంకాక్‌, థాయ్‌లాండ్‌ దేశాలకు చెందిన యువతులను గుర్తించారు. స్టడీ వీసాలపై వచ్చిన వారంతా ఈ వృత్తిలో కొనసాగుతున్నట్లు తెలుసుకున్నారు. దాడుల తర్వాత ఈ స్పాలను మూసివేసినా.. తిరిగి మరో పేర్లతో వెంటనే తెరుచుకోవడం మామూలైపోయిందని టాక్‌. బెజవాడకు కొత్త పోలీస్‌ కమిషనర్‌గా ఎవరొచ్చినా స్పాలపై దాడులు జరుగుతాయి.  ఆ తర్వాత వాటిపై కన్నెత్తి చూడరని అంటారు.

కమిషనరేట్‌లో పనిచేసే ఓ ఖాకీ అండగా ఉన్నారా? 

నగరంలో జరిగే ఈ తరహా దందాకు కమిషనరేట్‌లో పనిచేసే ఓ ఖాకీ అండగా ఉంటున్నట్లు కథలు కథలుగా చెప్పకొంటున్నారు. మొత్తం వ్యవహారాలు ఆయనే చూస్తాడట. ఆ ఖాకీ చెప్పడంతో పోలీస్‌ శాఖలోని మరికొందరు కూడా  చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు టాక్‌. బందర్‌ రోడ్డు, పటమట, మొగల్రాజపురం,  మాచవరం, పెనమలూరు, భవానీ పురం పరిధిలో స్పాల పేరుతో వ్యభిచారం దందాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగడాని ఆ ఖాకీ చల్లని చలువే కారణమని అంటారు.

అన్ని వ్యవహారాలనూ మానిటర్‌ చేస్తున్న మహిళ!

ఆ ఖాకీ నేరుగా తన చేతికి మట్టి అంటకుండా..  స్పా వ్యవహారాలను చూసే  ఓ మహిళ అన్నింటినీ మానిటర్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. పోలీసుల దాడులకు సంబంధించి ఈ మహిళ ద్వారా ముందస్తు చేరిపోతుందని సమాచారం. కేవలం పోలీసులు, ఆ మహిళే కాకుండా కొందరు రాజకీయ నేతలు కూడా ఈ దందాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారట. దీంతో ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లు పోలీస్‌ వర్గాలు గుసగుస లాడుకుంటున్నాయట.