మూడు రాష్ట్రాలు మూడు రేప్ అండ్ మర్డర్ లు...చివరకు దొరికాడిలా !

మూడు రాష్ట్రాలు మూడు రేప్ అండ్ మర్డర్ లు...చివరకు దొరికాడిలా !


ఒంటరి మహిళలే అతని టార్గెట్...శారీరక అవసరాల కోసం లోబరుచుకుంటాడు....ఎవరైనా అడ్డు చెబితే హతమార్చేస్తాడు...పోలీసులకు చిక్కకుండా మకాం మార్చేస్తుంటాడు. ఓ రియల్ క్రైమ్ ను అత్యంత చాకచక్యంగా దర్యాప్తు చేసి చేధించారు సిక్కోలు పోలీసులు. తన కోరిక తీర్చని మహిళలను హతమార్చిన ఆ అంతరాష్ట్ర హంతకుకడిని ఎట్టకేలకు పట్టుకోగలిగారు.  అలా వారు పట్టుకున్న వ్యక్తి పేరు సవర రమేష్ అలియాస్ సైకో రమేష్. ఒడిశాకు చెందిన రమేష్ కు శ్రీకాకుళం జిల్లా భీంపురం గ్రామానికి చెందిన సంప అనే మహిళతో పెళ్లైంది. 

2010లో రమేష్ భార్య సంపకు మతిభ్రమించింది. ఈ క్రమంలో రమేష్ మరో తోడు వెతికే పనిలో పడ్డాడు. 2016 అక్టోబర్ 16న ఒడిశాలోని బొడహంస గ్రామానికి చెందిన దేసేటి దమయంతి అనే మహిళను బలవంతం చేయబోయాడు. ఆమె నిరాకరించడంతో గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత తెలంగాణ పారిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఓ పేపర్ మిల్లులో కూలీగా చేరాడు. తనతో పాటు పని చేస్తున్న ముచ్చిక కోసమ్మపై కన్నేశాడు. 2017 నవంబరు 18న ఆమెను తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె నిరాకరించటంతో గొంతు నులిమి, బురదలో కూరి చంపేశాడు. అప్పట్లో అశ్వారావుపేట పోలీసులు సవర రమేష్ కోసం గాలించారు. 

అక్కడి నుండి పారిపోయిన అతను ఆ తర్వాత గుంటూరు జిల్లాలోని గొకినకొండ గ్రామంలోని ఓ చేపల చెరువు వద్ద పనికి కుదిరాడు. అక్కడే పనిచేస్తున్న బొమ్మలి లక్ష్మితో పరిచయం పెంచుకున్నాడు. లక్ష్మి తనకు అనారోగ్యంగా ఉండటంతో తోడుకు తన సోదరి దండు జయంతిని తీసుకొచ్చింది. ఈ క్రమంలో దండు జయంతికి భర్త లేడని తెలుసుకుని ఆమెకు డబ్బు ఆశచూపి దగ్గరయ్యాడు. జయంతి ఇంటి నిర్మాణం కోసం 30 వేలు అప్పుగా ఇచ్చాడు. లక్ష్మి కోలుకోవడంతో జయంతి తన స్వగ్రామమైన అలుదు వెళ్లిపోయింది. 2019 డిసెంబర్ 16వ తేదీన ప్లాన్ ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నాడు రమేష్. జయంతిని మెళియాపుట్టి మండలంలోని పట్టుపురం గ్రామానికి పిలిపించాడు. ఆమెను లోబరచుకునే ప్రయత్నంచేశాడు. 

ఆమె నిరాకరించడంతో గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని ఆఫ్ షోర్ రిజర్వాయర్ కాలువలో పడేశాడు. జయంతి కనిపించకపోవడంతో సారవకోట పోలీసులకు ఆమె కుమార్తె ఫిర్యాదు చేసింది. పదిరోజుల తర్వాత పట్టుపురంలో జయంతి మృతదేహం దొరికింది. మృతదేహం పూర్తిగా పాడైపోవడంతో ఆమెను ఎవరూ గుర్తించలేకపోయారు. జయంతిని చంపేసిన తర్వాత ఆమె ఫోన్ తీసుకెళ్లాడు. మూడు నెలలు తర్వాత రమేష్ ఫోన్ ఆన్ చేయగానే అలర్ట్ అయిపోయారు పోలీసులు. పక్కా ఆధారాలు సేకరించి అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి కామంతో అతను చేసిన తప్పులకు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు.