నీరవ్‌ దెబ్బకు పీఎన్‌బీ విలవిల

నీరవ్‌ దెబ్బకు పీఎన్‌బీ విలవిల

నీరవ్‌ మోడీ దెబ్బకు కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ).. మార్చి తైమాసికంలో భారీ నష్టాన్ని నమోదు చేసింది. మొండి బకాయిలపై కేటాయింపులు పెరగడంతో 2017-18 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (క్యు4) బ్యాంక్‌ రూ.13,416.91 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. దేశీయ బ్యాంకు ఈ స్థాయిలో నష్టాలు ప్రకటించడం ఇదే ప్రథమం. 2016-17 క్యూ4లో పీఎన్‌బీ రూ.262 కోట్ల లాభం నమోదు చేసింది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ.14,989.33 కోట్ల నుంచి రూ.12,945.68 కోట్లకు తగ్గింది. నీరవ్‌ మోడీ కుంభకోణంతో బ్యాంక్‌కు రూ.14,357 కోట్ల నష్టం ఏర్పడిందని పీఎన్‌బీ ప్రకటించింది. అందులో 50 శాతం నష్టాన్ని పూడ్చుకునేందుకుగాను క్యు4లో రూ.7,178 కోట్ల ప్రొవిజనింగ్‌ జరిపినట్లు బ్యాంక్‌ వెల్లడించింది. మిగతా సగం నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడు త్రైమాసికాల పాటు కేటాయింపులు జరపనున్నట్లు వివరించింది. నీరవ్‌ మోడీ స్కామ్‌లో ఎల్‌వోయూలు, ఎఫ్‌ఎల్‌సీలకు సంబంధించి ఇతర బ్యాంకులకు రూ.6,586 కోట్లు చెల్లించినట్లు పీఎన్‌బీ పేర్కొంది.
ఇక.. 2017-18 క్యూ4లో స్థూల నిరర్ధక ఆస్తులు (జీఎన్‌పీఏ) 12.53 శాతం నుంచి 18.38 శాతానికి, నికర నిరర్ధక ఆస్తులు 7.81 శాతం నుంచి 11.24 శాతానికి ఎగిశాయి. స్థూల ఎన్‌పీఏలు రూ.55,370 కోట్ల నుంచి రూ.86,620 కోట్లకు, నికర ఎన్‌పీఏలు రూ.32,702 కోట్ల నుంచి రూ.48,684 కోట్లకు పెరిగాయి. 2016-17 క్యు4లో ఎన్‌పీఎల కోసం రూ.4,910.39 కోట్ల ప్రొవిజనింగ్‌ జరుపగా.. గత ఏడాది ఇదే కాలానికి రూ. 16,202.82 కోట్లు కేటాయించింది. పన్నులు మినహాయించి మొత్తం ప్రొవిజనింగ్‌ రూ.20,353.10 కోట్లకు చేరుకుంది.