ఎన్‌పీఏలకు మోడీ విరుగుడు

ఎన్‌పీఏలకు మోడీ విరుగుడు

దేశీయ బ్యాంకింగ్‌ రంగానికి గుదిబండగా మారిన నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) బెడద నివారించేందుకు మోడీ ప్రభుత్వం కొత్త చిట్కాలు కనిపెడుతోంది. ప్రతి త్రైమాసికంలో ప్రభుత్వం రంగ బ్యాంకులు భారీ మొత్తంలో ఎన్‌పీఏలను ప్రకటించడం వల్ల ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఆమేరకు చాలా మొత్తం లాభాల నుంచి పక్కన పెట్టాల్సి వస్తోంది. దీనివల్ల పలు బ్యాంకులు తొలిసారిగా నష్టాలను ప్రకటించాయి. ఎస్‌బీఐకి కూడా నష్టాల బెడద తప్పలేదు. నష్టాల సంగతి అటుంచి నిరర్థక ఆస్తుల ప్రావిజినింగ్‌ కారణంగా బ్యాంకుల వద్ద మూలధనం తగ్గిపోతోంది. దీనితో రుణాలపై బ్యాంకులు శ్రద్ధ చూపలేకపోతున్నాయి. దీని కోసం కొత్తగా ప్రొవిజన్‌ షోర్‌ అప్‌ సర్టిఫికెట్‌ (పీఎస్‌సీ)లను జారీ చేసే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోతంది.

అంటే ఎన్‌పీఏలుగా ఎంత మొత్తాన్ని ప్రకటిస్తున్నారో అంత మొత్తానికి సరిపడా పీఎస్‌సీలను కేంద్రం జారీ చేస్తోంది. దీంతో బ్యాంకు తన లాభాల నుంచి ప్రొవిజినింగ్‌ చేయాల్సిన పని ఉండదు. బాకీలు వసూలయ్యాక ఈ సర్టిఫికెట్ల భారాన్ని బ్యాంకులు తగ్గించుకుంటాయి. దీనివల్ల బ్యాంకులు ముఖ్యంగా పీఎస్‌యూ  బ్యాంకులకు ఎన్‌పీఏల భయం తగ్గి... రుణాల జారీకి నడుం బిగిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పీఎస్‌సీల జారీ అనేది ఇంకా ఆలోచన దశలోనే ఉందని, త్వరలోనే మరింత పకడ్బందీగా వీటిని అమలు చేసే అంశాలను ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.