నేపాల్ జానకి ఆలయంలో మోడి..

నేపాల్ జానకి ఆలయంలో మోడి..

భారత ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్‌లో పర్యటిస్తున్నారు. ఈరోజు  జనక్‌పూర్‌ విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. అక్కడ నుంచి జానకి ఆలయానికి చేరుకున్న మోడీకి నేపాల్‌ ప్రధాని కేపీ ఓలీ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జానకీ ఆలయాన్ని సందర్శించారు. ఇందులో భాగంగా మోడీ-ఓలీ కలిసి జనక్‌పూర్‌లో జనక్‌పూర్‌-అయోధ్య బస్సు‌ సర్వీస్‌ను ప్రారంభించారు. అక్కడే మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ... 'జనక్‌పూర్‌ సందర్శనం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక్కడి రాజు జనక్‌, జానకీ మాతను సందర్శించుకోవడం మర్చిపోలేని అనుభూతి. నాకు ఇంతటి ఘనస్వాగతాన్ని అందించిన ఓలీకి ధన్యవాదాలు. ఇక్కడి ప్రకృతి లాగే ప్రజలు కూడా చాలా మంచి వారు. నాకోసం ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. జనక్‌పూర్‌ అయోధ్య బస్సు‌ సర్వీస్‌ చారిత్రకమైంది. సాధారణంగానే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అవి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.' అని తెలిపారు. ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా నేపాల్‌ అధ్యక్షురాలు విద్యాదేవీ భండారీ, ఉపాధ్యక్షుడు నంద బహదూర్‌ పున్‌, ప్రధాని కేపీ ఓలీలతో చర్చలు జరపనున్నారు.