ఏమాత్రం తగ్గని మోడీ క్రేజ్‌..మోడీ 2.0 పాలన ప్రత్యేకతలు ఇవే!

ఏమాత్రం తగ్గని మోడీ క్రేజ్‌..మోడీ 2.0 పాలన ప్రత్యేకతలు ఇవే!

అక్కడ ఆ ఇంద్రుడు.. ఇక్కడ ఈ నరేంద్రుడు... అన్నట్టుగా రెండో దఫా అఖండ మెజార్టీ సాధించి సింహాసనాన్ని అధిష్టించారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ... బీజేపీని ఎవరూ ఊహించని విజయతీరాలకు చేర్చారు. సంవత్సరకాలంగా సంచల నిర్ణయాలతో.. తన రెండో టర్మ్‌ రూలింగ్‌ను కూడా రసవత్తరంగా సాగిస్తున్నారు. ఇటు కొన్ని విషయాల్లో విమర్శల్ని కూడా ఎదుర్కోక తప్పలేదు. ప్రధానిగా మోడీ రెండోసారి అధికారం చేపట్టి నేటికి ఏడాది పూర్తైంది...

ప్రధాని నరేంద్ర మోడీ.. ఏదీ చెప్పరు. చేసి చూపిస్తారు. తన ఐదేళ్ల పాలన తర్వాత.. 2019లో రెండో దఫా ఎన్నికలకు వెళ్లిన ఆయన .. తానే విజయం సాధిస్తానని ఎక్కడా చెప్పలేదు. సైలెంట్‌గా తనపని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. చివరకు బంపర్‌ మెజార్టీ సాధించి రెండోసారి సింహాసనం ఎక్కారు. .దేశంలో ఆరేళ్ల క్రితం మొదలైన నమో మానియా ఇంకా తగ్గలేదు. మోడీ క్రేజ్‌ ఇసుమంతయినా తగ్గలేదు. 2014లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ.. మరోసారి అంతే విశ్వాసంతో 2019 ఎలక్షన్లకు వెళ్లారు. తన ఐదేళ్ల పాలనపై మెజార్టీ ప్రజలు సంతోషంగా ఉన్నారన్న విశ్వాసంతో ముందుకు నడిచారు. విజయం సాధించారు.

కొందరు మోడీ గ్రాఫ్‌ తగ్గిపోయిందన్నారు.. మళ్లీ 2004 పునరావృతం అవుతుందన్నారు... కానీ 2019 ఎలక్షన్ల ఫలితాలు మాత్రం విమర్శకుల నోళ్లు సైతం మూయించాయి. 543 స్థానాలకు గాను.. ఏకంగా బీజేపీ 303 స్థానాలను కైవసం చేసుకుని ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. గతం కంటే 21 సీట్లు అధికంగా గెలుచుకుని..సత్తా చాటింది...మే 23న విడుదలైన భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలలతో మరోసారి ప్రపంచమంతా నరేంద్రమోడీ పేరు మార్మోగిపోయింది. 303 స్థానాలతో,బీజేపీకి రికార్డు స్థాయి విజయం లభించింది. భాగస్వామ్య పక్షాలతో కలిపి బీజేపీ కూటమి ఎన్డీఏకు 353 సీట్లు వచ్చాయి.
2019 మే 30న రెండోసారి ప్రధానిగా ప్రమాణం

తనకు మరోసారి అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన భారత ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ.. మే 30న రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు నరేంద్ర మోడీ. సంచలనాత్మక నిర్ణయాలతో ముందుకు సాగుతూ.. రెండో దఫా ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు..బంపర్‌ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ పాలనలో.. ఈసారి ఏమైనా చేంజ్‌ కనిపించిందా? ఆయన స్వభావం ఏమైనా మారిందా? ఈ ఏడాది పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, సాధించిన విజయాలు ఏమిటి?

సబ్‌కా సాథ్‌ , సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్‌  అనే నినాదంతో రెండో సారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ... అదే విశ్వాసంతో ముందుకు సాగారు. అదరకుండా, బెదరకుండా నిర్ణయాలు తీసుకోవడం తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. మే 30,2019న ప్రధాని పీఠాన్ని మరోసారి అధిష్టించింది మొదలు.. సంచలన నిర్ణయాలతో కొత్త అధ్యాయాన్ని రాసే ప్రయత్నం చేశారన్నది BJP శ్రేణుల మాట...ఏడాది నాడు అధికారంలోకి రాగానే ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న కీలక నిర్ణయం.. తనకెంతో ప్రీతిపాత్రుడైన అమిత్‌షాకు హోంశాఖను అప్పగించడం. ఇక అక్కణ్నుంచి సంచలన నిర్ణయాలు మొదలయ్యాయి. పక్క ప్రణాళికతో కృష్ణార్జునులను తలపించేలా... లక్ష్యం వైపు ముందుకు సాగింది మోడీ, షా ద్వయం.

తొలి దఫా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ట్రిపుల్‌ తలాక్‌ను చట్టవిరుద్ధం చేయాలని ప్రయత్నిస్తున్న మోడీ సర్కార్‌.. రెండో దఫాలో మాత్రం ఎలాంటి ఆలస్యం చేయలేదు. తొలి సెషన్‌లోనే పని కానిచ్చేసింది. ఎంతో కాలంగా ముస్లిం మహిళలకు తీరని అన్యాయం చేస్తున్న ట్రిపుల్‌ తలాక్‌ విధానాన్ని రాజ్యాంగం విరుద్ధం చేస్తూ... 2019 జూలై 30న పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఎన్ని విమర్శలు ఎదురైనా.. ఈ నిబంధనను మోడీ సర్కార్‌ పక్కాగా అమలు చేస్తోంది.

మోడీ తన రెండో టర్మ్‌లో తీసుకున్న అతి కీలకమైన నిర్ణయం.. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు. కొన్ని దశాబ్దాలుగా ఈ ఆర్టికల్‌ ద్వారా జమ్ముకశ్మీర్‌ అనుభవిస్తున్న ప్రత్యేక హోదాను, స్వయం ప్రతిపత్తిని... ఒకేదేశం, ఒకేరాజ్యాంగం అనే నినాదంతో 2019 ఆగస్టు5న రద్దు చేసింది భారత ప్రభుత్వం. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా.. వెనకడుగు వేయని మోడీ సర్కార్‌.. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదాను రద్దు చేసింది. రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసి.. జమ్ముకశ్మీర్‌, లడాఖ్‌ ల పేరుతో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది.

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్న ప్రధాని నరేంద్రమోడీ... జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని తొలగించడం ద్వారా ఆ దిశగా కీలక అడుగే వేశారు. అప్పటివరకూ జమ్ముకశ్మీర్‌లో దాయాది పాకిస్తాన్‌ చేస్తున్న ఆగడాలకు చెక్‌ పడింది. ఉగ్రవాదుల కదలికలు తగ్గిపోయాయి. పరిస్థితి మొత్తం కేంద్రం చేతుల్లోకి వచ్చేసింది. ఈ విషయంలో అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మోడీ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో దేశయువత దృష్టిలో హీరోగా నిలిచిపోయారు మోడీ.

ఎన్నో ఏళ్లుగా నానుతూ వస్తున్న రామమందిరం, బాబ్రీమసీదు వివాదం.. మోడీ రెండో టర్మ్‌.. తొలి ఏడాదిలోనే ముగిసిపోవడం విశేషం. నవంబర్‌ 9న రామమందిరంపై తుదితీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.. అది హిందువులకే చెందుతుందని తీర్పునిచ్చింది. ప్రస్తుత వివాదాస్పద భూమిలో రామమందిర నిర్మాణం చేపట్టేందుకు.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఆరు నెలల్లోనే అమలు చేసినట్టయ్యింది. దీంతో మోడీ మానియా మరింత పెరిగిపోయింది. తొలి సారి అధికారంలోకి వచ్చాక... ప్రధాని మోడీ రెక్కలు కట్టుకున్న విహంగంలా దేశవిదేశాలు చుట్టొచ్చారు. దీనిపై విపక్షాలు బోలెడన్ని విమర్శలు కూడా చేశాయి. మరి ఈసారి ఆయన తీరెలా ఉంది. ఈ ఏడాదికాలంలో పర్యటనల డోసు పెంచారా? తగ్గించారా?

రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోడీ పేరు.. దేశంలోనే కాదు, ప్రపంచమంతా మార్మోగిపోయింది. అగ్రరాజ్యాధినేతలు సైతం మోడీని ప్రశంసల్లో ముంచెత్తారు. మోడీ తమ స్నేహితుడనీ..గ్లోబల్‌ లీడర్‌గా మారుతున్నారని... కితాబిచ్చారు. భీకర ఫామ్‌లో ఉన్న మోడీ.. ఇక తొలిదఫాను మించి విదేశీ పర్యటనలు చేస్తారని అంతా భావించారు. రెండో టర్మ్‌లో ప్రధాని మోడీ.. ఎవరి ఊహలకు అందడంలేదు. విదేశీ పర్యటనల విషయంలోనూ అందరికీ షాకిస్తూ విభిన్నంగా వ్యవహరిస్తున్నారు. సెకండ్‌ టైమ్‌ ప్రధాని పీఠం ఎక్కడి.. ఏడాది పూర్తయినా.. మోడీ వెళ్లొచ్చిన గ్రాండ్‌ టూర్‌ యూఎస్‌ మాత్రమే. ఆ తర్వాత ప్రధాని మోడీ ఏ విదేశీ పర్యటనకూ వెళ్లకపోగా... ఇతర దేశాధినేతలే ఇక్కడకు వచ్చారు.

2019, సెప్టెంబర్‌ 23న అమెరికాలోని హ్యూస్టన్‌లో ప్రవాస భారతీయుల నేతృత్వంలో ప్రధాని కోసం ఏర్పాటు చేసిన హౌడీ మోడీ కార్యక్రమం...  ఒక సెన్సేషన్‌గా చెప్పవచ్చు. ఇంతవరకూ అమెరికాలో ఏ విదేశీ నేతకూ లభించని గ్రాండ్‌ వెల్‌కమ్‌.. ఈ ప్రోగ్రాం ద్వారా ప్రధాని మోడీకి లభించింది. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా పాల్గొని.. మోడీ తన ఆప్తమిత్రుడని ప్రకటించారు. దీంతో, మోడీ పేరు నిజంగానే విశ్వవ్యాప్తం అయ్యింది..ఇక, ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండ్రోజుల భారత పర్యటనకు వచ్చారు. ఫిబ్రవరి 24న గుజరాత్‌కు వచ్చిన ట్రంప్‌.. ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిర్మించిన మొతెరా క్రికెట్‌ స్టేడియాన్ని ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో... ప్రధాని మోడీతో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ వేదిక ద్వారా మరోసారి తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు. కీలక ఒప్పందాలు చేసుకున్నారు.ఈ ట్రిప్పులో.. ట్రంప్‌కు భారీ స్వాగతం లభించింది.

ఈ రెండు గ్రాండ్‌ టూర్‌లకు మధ్యలో.. భారత్‌కు మరో విశిష్ట అతిథి వచ్చి వెళ్లారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌... రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. అక్టోబర్‌ 11న మహాబలిపురానికి వచ్చిన జిన్‌ పింగ్‌కు... ప్రధాని మోడీ పంచెకట్టులో వెళ్లి ఘనస్వాగతం పలికారు. వీరిద్దరి మధ్య కీలకమైన చర్చలు జరిగాయి. మొత్తానికి, ప్రపంచదేశాల్లో భారత్‌కు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచడంలో ప్రధాని మోడీ సక్సెస్సయ్యారని చెప్పొచ్చు. అగ్రరాజ్యాలు సైతం ఇండియా వైపు చూసేలా చేశారు ప్రధాని.ఇంతకు ముందున్న ఇండియన్‌ ప్రైమ్‌ మినిస్టర్స్‌కు.. తనకూ ఉన్న తేడా ఏమిటో చూపించారు.

ఎవరు ఏం అనుకున్నా.. తాను అనుకున్నది చేసేయడమే మోడీకి అలవాటు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచీ ఆయనది అదే పంథా. ప్రధానిగా కూడా ఇప్పుడు అలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు మోడీ. దేశానికి ఏది మంచిదనిపిస్తే.. అది చేసేస్తున్నారు. అలా ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని వివాదాలకు దారి తీశాయి.

మోడీ.. మోడీ.. మోడీ.. రోజులు గడుస్తున్నా ఈ పేరుకున్న క్రేజ్‌.. ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే రెండో టర్మ్‌లో మరింత మెజార్టీతో అధికారం దక్కించుకున్నారు మోడీ. ఆ జోష్‌లోనే ఆయన ఈ ఏడాది కాలంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, వాటిలో కొన్ని వివాదాస్పదమయ్యాయి. విపక్షాల చేతికి కాసింత పని దొరికేలా చేశాయి..ఏడాది తొలిసగంలో మోడీ తీసుకున్న ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ వ్యతిరేక చట్టం వంటి నిర్ణయాలు.. కొన్ని వర్గాలకు ఆగ్రహాన్ని తెప్పించాయి. రాజ్యసభలో బలం లేకపోయినా..సునాయసంగా బిల్లులను ఆమోదింపజేసుకుంది ప్రభుత్వం. దీంతో వీటిపై భారీ రగడే జరిగింది. కానీ, అవేమీ ఎక్కువకాలం నిలవలేదు. మెజార్టీ ప్రజలు దీనికి ఆమోదం తెలపడంతో.. ఇవేమీ పెద్దగా మోడీ సర్కారుపై ప్రభావం చూపలేదు.

ఏడాది రెండో సగంలో... మాత్రం మోడీ, షా ద్వయం తీసుకున్న నిర్ణయాలు దేశంలో అగ్గిని రాజేశాయి.  పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్‌లలో మైనార్టీలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత్‌ పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పించే పౌరసత్వ చట్టానికి సవరణలు చేశారు. ఇందులో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారి తీసింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటులో బిల్లును ఆమోదించినప్పటికీ దేశవ్యాప్తంగా అగ్గిరాజుకుంది. ముస్లింలలో ఒక అభద్రతా భావాన్ని నింపింది.  

పౌరసత్వ చట్టానికి చేసిన సవరణలు దేశవ్యాప్తంగా మంటలు పుట్టించాయి. సీఏఏకి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ మొదలు గల్లీ స్థాయికి..ఆందోళనలు జరిగాయి. ముస్లింల పౌరసత్వాన్ని తొలగించేందుకు తీసుకొచ్చిన ఎన్నార్సీకి ముందుగా జరిగే ప్రక్రియే సీఏఏ అంటూ.. దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. అయితే, ఈ చట్ట ఉద్దేశ్యాన్ని ప్రజల్లోకి సరిగ్గా తీసుకువెళ్లడంలోనూ, ముస్లింలలో భద్రతను నెలకొల్పడంలోనూ మోదీ సర్కార్‌ విఫలమైందనే చెప్పొచ్చు. రెండోసారి ప్రధానిగా సింహాసనం ఎక్కారు..!  అది కూడా ఆషామాషీగా కాదు..అఖండ విజయంతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే, అంతటి మాయ చేసిన మోడీకి... తొలి ఏడాది పొలిటికల్‌గా నిరాశే మిగిలింది. పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది.
 
పార్లమెంటు ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు... రెండోసారి సూపర్‌ మెజార్టీతో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఈ విషయం బాగా బోధపడింది. ఎందుకంటే, పార్లమెంట్‌ ఎన్నికల్లో విపరీతమైన ప్రభావం చూపిన మోడీ మానియా.. ఈ ఏడాది కాలంలో జరిగిన వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కనిపించలేదు. అధికారంలో ఉన్నచోట కూడా పెద్దగా ఫలితం కనిపించలేదు.

దేశరాజధానితో పాగా వేయాలని ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న బీజేపీకి ఈ సారి కూడా నిరాశే ఎదురైంది. 2020 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పరాభవం తప్పలేదు. అంతుకు ముందు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో.. ఢిల్లీలోని అన్ని స్థానాలనూ కైవసం చేసుకున్న బీజేపీ విధానసభలో మాత్రం సత్తా చాటలేకపోయింది. 70 స్థానాలుగాను, 60 సీట్లు సాధించి.. వరుసగా మూడోసారి కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. అంతకు ముందు జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో మోడీ, షా.. ప్లాన్స్‌ వర్కవుట్‌ కాలేదు. బీజేపీకి ఆశించిన ఫలితం దక్కలేదు. హర్యానాలో హంగ్‌ ఏర్పడింది. మ్యాజిక్‌ ఫిగర్‌కు బీజేపీ ఐదు స్థానాల దూరంలో నిలిచిపోగా... పది స్థానాలు సాధించిన జేజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
మహారాష్ట్రలోనూ బీజేపీకి నిరాశే

మహారాష్ట్రలోనూ బీజేపీకి నిరాశే ఎదురైంది. శివసేనతో తెగదెంపుల తర్వాత ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీకి.. మోడీ, షా జోడీ వ్యూహాలు లాభం చేకూర్చలేదు. మ్యాజిక్ ఫిగర్‌కు చాలా దూరంలో నిలిచిపోయింది. అయినప్పటికీ, ఎన్సీపీని చీల్చి..  ఆ మద్దతుతో మరోసారి ఫడ్నవీస్‌నే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించింది. అయితే, ఆ వ్యూహం కూడా బెడిసికొట్టడంతో..చివరకు కాంగ్రెస్‌, ఎన్సీపీల మద్దతుతో శివసేన అధికారం చేజిక్కించుకుంది..2019చివర్లో జరిగిన జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలూ మోడీకి.. భారీ షాకిచ్చాయి. ఫలితంగా బీజేపీ అక్కడ అధికారాన్ని కోల్పోవల్సి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీతో కలిసి జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హేమంత్‌సోరెన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

క్షణక్షణం ఉత్కంఠ రేపిన కర్నాటక, మధ్యప్రదేశ్‌ ఎపిసోడ్‌లో.. బీజేపీ వ్యవహరించిన తీరు మోడీ ఇమేజ్‌ను కొంత డ్యామేజ్‌ చేశాయని చెప్పొచ్చు. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ కూటములను కూలదోసి.. అధికారం చేజిక్కించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి బంపర్ మెజార్టీతో మరోసారి ప్రధాని పీఠం చేజిక్కించుకున్నా.. రాష్ట్రాల దగ్గరకొచ్చేసరికి రాజకీయంగా మోడీకి అంతగా కలిసిరాలేదనేచెప్పాలి...రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత...  ఏడాది కాలంలో మోడీ సర్కార్‌ ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్‌ కరోనా వైరస్‌. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్‌ను కట్టడిచేసేందుకు... దానివల్ల దేశానికి కలిగే నష్టాన్ని భర్తీచేసేందుకు.. ప్రధాని సాహసోపేతమైన నిర్ణయాలే తీసుకున్నారు.

ఎటు చూసినా కరోనా..కరోనా... ప్రపంచమంతా అల్లాడిపోతోంది.. అగ్రదేశాల్లో సైతం ఆహాకారాలు వినిపిస్తున్నాయి. గంటగంటకు వందలు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అలాంటి భయానక వాతావరణం సృష్టించిన ప్రాణాంతక కరోనా వైరస్‌.. మన దేశంలోనూ అడుగు పెట్టింది. విదేశాల నుంచి వస్తున్నవారితో మెల్లమెల్లగా దేశంలో వ్యాప్తి చెందడం మొదలెట్టింది. కేంద్రానికి పెద్ద సవాల్‌ విసిరింది.

అత్యాధునిక వనరులు ఉన్న దేశాలను సైతం కరోనా వణికిస్తోంది. కట్టుదిట్టమైన నిబంధనలు కలిగిన దేశాల్లో  సైతం ఈ వైరస్‌.. వీరవిహారం చేస్తోంది. అలాంటిది.. 130 కోట్ల జనాభా కలిగిన దేశంలో కరోనాను కట్టడం చేయడం సాధ్యమయ్యే పనేనా? ఒక్కసారి మొదలైతే.. ఇక కరోనా పాజిటివ్‌ కేసులు కోట్లలోనే ఉంటాయన్న భయం అందరిలో ఏర్పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. నిజానికి మన దేశ జనాభాకు, ఉన్న వనరులకు, పరిస్థితులకు.. ఎవరైనా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తారు. ఈ కల్లోల సమయంలో.. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు సాహసోపేతమైన నిర్ణయాలే తీసుకున్నారు ప్రధాని మోడీ. ఇంత పెద్ద జనాభా కలిగిన దేశాన్ని సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించడం.. ప్రపంచదేశాలను సైతం ఔరా అనిపించేలా చేసింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల.. ఆరోగ్యరంగంపై తీవ్ర ప్రభావం పడకుండా చూడగలిగిన మోడీ.. ప్రపంచం దృష్టిలో మరోసారి హీరోగా నిలిచారు. ప్రధానంగా తన నిర్ణయంతో మోడీ.. దేశానికి పట్టుకొమ్మల్లాంటి పల్లెలలకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూడగలిగారు.

మార్చి 22న జనతా కర్ఫ్యూ పిలుపుతో ప్రజలను కరోనాపై పోరుకు సన్నద్ధం చేసిన ప్రధాని... ఆ తర్వాత దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఆ తర్వాత కొద్దికొద్దిగా సడలింపులు ఇస్తూ.. లాక్‌డౌన్‌ను మూడు దఫాలుగా పొడిగించి.. కరోనా కేసులు పెరగకుండా చూడగలిగారు. ఇన్ని రోజుల పాటు ప్రధాని మాటకు కట్టుబడి ప్రజలు సైతం.. లాక్‌డౌన్‌లో ఉండడం మోడీ బలాన్ని, ఆయనపై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి.

అయితే, ప్రధాని మోడీ కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా... లాక్‌డౌన్‌ సమయంలో వలసకూలీల ఉదంతం కేంద్రాన్ని విమర్శలపాలు చేసింది. వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పొట్టకూటికోసం వలస వచ్చిన కార్మికులు.. కాలినడక ఎండలో కుటుంబాలతో కలిసి ప్రయాణాలు సాగించడం పెద్ద దుమారం రేపింది. వలస కార్మికుల గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా... హడావిడిగా లాక్‌డౌన్‌ను ప్రకటించారంటూ... విపక్షాలు విమర్శలు గురిపెట్టాయి. కాస్త గందరగోళం ఏర్పడినా.. ప్రత్యేక వలస కూలీల తరలింపు కోసం ప్రత్యేక శ్రామిక్‌ ట్రైన్స్‌ ఏర్పాటు చేసిన కేంద్రం.. వివాదానికి తెరదించింది. అంతేకాదు, వందే భారత్ మిషన్‌లో భాగంగా.. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సైతం ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలించింది.
కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ... మిగితా దేశాలతో పోలిస్తే మనదేశంలో వైరస్‌ కంట్రోల్‌లోనే ఉంది. మన దేశంలో జనాభాకు ఈ మాత్రం కట్టడి లేకుంటే.. ఇప్పటికే కోట్ల సంఖ్యలో కేసులు నమోదయ్యేవన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందుకే కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాల్లోనే మోదీ నెంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకున్నారు.
పలు దేశాలకు హైడ్రో క్లోరోక్విన్‌ సరఫరాతో కరోనాపై పోరులో ప్రపంచదేశాలకు సైతం.. అండంగా నిలుస్తోంది మోడీ నేతృత్వంలోని భారత్‌. ఇప్పటికే కోవిడ్‌ నియంత్రణ కోసం వివిధ దేశాలకు హైడ్రో క్లోరోక్విన్‌, పారాసిటమల్‌ ఔషధాలను భారీ స్థాయిలో సరఫరా చేస్తూ కీలకంగా వ్యవహరిస్తోంది.


ఇక, కరోనా కల్లోలంతో నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ఇప్పటికే రెండు ప్యాకేజీలను ప్రకటించారు ప్రధాని మోడీ. ఇటీవల 20 లక్షల కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్న సమయంలో.. కరోనా విజృంభణ దేశాన్ని ఆర్థికంగా మరింత అతలాకుతలం చేసింది. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో మోదీ విజయం సాధించినప్పటికీ, ఆర్థికంగా దేశాన్ని గాడిలో పెట్టే చర్యల్లో విఫలమయ్యారని, నిరుద్యోగాన్ని తగ్గించడంలో తీసుకున్న చర్యలు శూన్యమని అభిప్రాయపడే వారూ ఉన్నారు.