ఈఎస్ఐ కేసుల నుండి బయటపడేందుకు పితాని కొత్త ఎత్తులు !

ఈఎస్ఐ కేసుల నుండి బయటపడేందుకు పితాని కొత్త ఎత్తులు !

కేసు నుంచి తప్పుకోవడానికి ఎత్తులు వేస్తున్నారా? కుదిరితే పార్టీ మారడం లేదంటే సామాజికవర్గం కార్డుతో రాజకీయంగా బెనిఫిట్‌ పొందాలని చూస్తున్నారా? ఇలా చేస్తే అరెస్ట్‌ నుంచి బయట పడతారా? ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయా?  

ఈఎస్‌ఐ స్కామ్‌లో మాజీ మంత్రి పితానిని అరెస్ట్‌ చేస్తారా?

ESI స్కామ్‌లో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టయి  జైలులో ఉన్నారు. మరికొందరు అధికారులు సైతం ఊచలు లెక్క పెడుతున్నారు. ఈ కేసులో మరో మంత్రి పితాని సత్యనారాయణ పాత్రపై రకరకాలుగా ప్రచారం జరుగుతున్నా.. ఆయన్ని అరెస్ట్‌ చేస్తారా లేదా అన్నది క్లారిటీ లేదు. కాకపోతే పితాని మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర PSగా పనిచేసిన మురళీని ACB అధికారులు అరెస్ట్‌ చేయడంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. పితాని కుమారుడు సురేష్‌ ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించడం కూడా ఈ ఎపిసోడ్‌ మరింత ఆసక్తిగా మారింది.

తనయుడి కాంట్రాక్ట్‌కు తండ్రిగా పితాని సాయం చేశారా?

పితాని కుమారుడు సురేష్‌ అప్పట్లో మందుల సరఫరా కాంట్రాక్ట్‌ దక్కించుకోవడంతో దర్యాప్తు అధికారులు అటు ఫోకస్‌ పెట్టారు. తనయుడికి కాంట్రాక్ట్‌ దక్కడంలో మాజీ మంత్రి సాయం చేశారని గుర్తిస్తే  పితాని అరెస్ట్‌ ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అందుకే ఈ అరెస్ట్‌ల వ్యవహారం తన కుమారుడిని దాటి తన వరకూ వస్తుందేమోనన్న అనుమానంతో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట మాజీ మంత్రి. పశ్చిమ గోదావరి జిల్లాలోని తన బలగాన్ని సిద్ధం చేస్తున్నారట. 

బీసీ నాయకులను సమీకరిస్తున్న పితాని?

పితాని గతంలో YS కేబినెట్‌లో, టీడీపీలో చేరిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో చోటు సంపాదించారు.  ఆ అనుభవంతో ఈ కేసులో నుంచి ఎలా బయటపడాలా అని బుర్రకు పదును పెడుతున్నారట. జిల్లాలోని బీసీ నాయకులందరినీ సమీకరిస్తున్నట్లు సమాచారం. అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. బీసీ ముఖ్యనాయకులను పిలిచి తన ఇంట్లో మంతనాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. గత మూడు రోజులుగా బీసీ నాయకులు పితాని ఇంటికి వస్తుండటంతో దీనికి బలం చేకూరుతోంది. 

అప్పట్లో పితాని వైసీపీలో చేరతారని ప్రచారం?

ఈ సందర్భంగా పితానిని కలిసిన బీసీ నాయకులు చేస్తున్న కామెంట్స్‌, సూచనలు ఆసక్తిగా ఉన్నాయట. కేవలం టీడీపీ నాయకులపై కక్ష తీర్చుకోవడానికే ఈ అరెస్ట్‌లు చేస్తున్నారని.. పితానిని ఏమీ చేయలేక.. ఆయన కుమారుడిని టార్గెట్‌ చేశారని అంటున్నారట. కుమారుడిపై గురిపెడితే పితాని దారిలోకి వస్తారన్నది అధికార పార్టీ వ్యూహంగా విశ్లేషిస్తున్నారట. వాస్తవానికి రాష్ట్రంలో YCP ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచీ పితాని సత్యానారాయణ ఆ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. కాకపోతే దారులు మూసుకుపోయాయని టాక్‌.

బీసీ నాయకులతో కలిసి పార్టీ మార్పును ప్రతిపాదిస్తారా?

ఇప్పుడు ESI కేసు తెరపైకి రావడంతో.. మరోసారి YCPలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం  మొదలైంది. భారీ మందీమార్భలంతో వెళ్తే తప్ప వైసీపీ చేర్చుకునే పరిస్థితి లేదన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. పైగా టీడీపీకి భారీ నష్టం జరుగుతుందని భావిస్తేనే YCPలోకి ఆహ్వానిస్తున్నారట. అందుకే పితాని జిల్లాలోని బీసీ నాయకులను అందరినీ కలుపుకొని పార్టీ మారే ప్రతిపాదనను YCP ముందు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. 

అరెస్ట్‌ సమయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతారా?

ఈ ప్రతిపాదనకు అధికార పార్టీ ఓకే అంటే సరే. లేదంటే అరెస్ట్‌ సమయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి తన సామాజికవర్గంలో సానుభూతి పొందడమనే  వ్యూహానికీ పితాని పదును పెడుతున్నట్లు సమాచారం. ఈ రెండు అంశాల్లో ఏది జరిగినా మన మంచికే అన్న ఆలోచనకు వచ్చారట మాజీ మంత్రి. మరి.. ఈ విషయంలో పితాని సత్యనారాయణ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి.