ఆల్ టైమ్ హైకి పెట్రో ధరలు

ఆల్ టైమ్ హైకి పెట్రో ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తూ ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయి... కర్ణాటక ఎన్నికల కారణంగా ఆయిల్ కంపెనీలు కొన్నాళ్లపాటు ఇంధన ధరల పెంపును వాయిదా వేయడంతో ప్రభుత్వ రంగ ఇంధన సరఫరా కంపెనీల లాభాల్లో కోతపడింది. ఇప్పుడు వాటిని పూడ్చుకునే ప్రయత్నాల్లో భాగంగా వడ్డింపులు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ రోజు లీటర్ పెట్రోల్‌పై 33 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెంచడంతో ఢిల్లీలో ఆల్‌టైమ్ హై రికార్డును క్రియేట్ చేశాయి చమురు ధరలు... తాజా పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.24కు చేరగా... డీజిల్ ధర రూ.67.57గా పలుకుతోంది. ఇక స్థానిక అమ్మకపు పన్ను, ఇతర పన్నులను కలిపి వివిధ రాష్ట్రాల్లో ఈ ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఢిల్లీలో పెట్రో ధరలు అన్ని మెట్రో నగరాలు, ఇతర రాష్ట్రాల రాజధానిలతో పోలిస్తే అత్యంత చౌక. 

దేశంలోనే పెట్రోల్ ధరలు ముంబైలో అత్యంత ఖరీదు... ఇక్కడ స్థానిక పన్నులు కలుపుకుని లీటర్ పెట్రోల్‌ ధర రూ.84.07కు చేరింది. భోపాల్‌లో రూ .81.83, పాట్నాలో రూ. 81.73, హైదరాబాద్‌లో రూ.80.76, కోల్‌కతాలో రూ. 78.91, చెన్నైలో 79.13గా ఉంది. ఇక డీజిల్ ధర విషయానికి వస్తే హైదరాబాద్‌లో స్థానిక పన్నులతో కలుపుకుని లీటర్ ధర రూ. 73.45, త్రివేండ్రంలో రూ. 73.34, రాయాపూర్‌లో 72.96, గాంధీనగర్‌లో రూ. 72.63, భువనేశ్వర్‌లో 72.43, పాట్నాలో రూ.72.24, జైపూర్‌లో రూ. 71.97, రాంచీలో రూ. 71.35, భోపాల్‌లో రూ. 71.12, శ్రీనగర్‌లో రూ. 70.96, ముంబైలో రూ.71.94, కోల్‌కతాలో రూ.70.12, చెన్నైలో రూ. 71.32 గా ఉంది. పెరుగుతోన్న పెట్రో ధరలు సామాన్యుడికి భారంగా మారుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.