నేటి నుంచే ఆచార్య నాగార్జునలో పీసెట్

నేటి నుంచే ఆచార్య నాగార్జునలో పీసెట్

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈరోజు నుంచి వ్యాయామ కళాశాలలో చేరేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో పీసెట్‌ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాజేంద్రప్రసాద్‌ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు 3,807 మంది పోటీలలో పాల్గొంటున్నారని వెల్లడించారు. వరసగా 12వ సంవత్సరం ఏఎన్‌యూ ఆధ్వర్యంలో పీసెట్‌ నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు.   ఈ పోటీలను తొలిసారిగా విశ్వవిద్యాలయంలోని సింథటిక్‌ మైదానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 2,936 మంది పురుషులు, 871 మంది మహిళలు ఈ కళాశాలలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీపీఈడీకి 1880 మంది, యూజీడీపీఈడీకి 1927 మంది దరఖాస్తు చేసినట్లు వీసీ తెలిపారు. పురుషులకు 24 నుంచి 29 వరకు, మహిళలకు 30, 31 తేదీలలో పోటీలు నిర్వహించనున్నారు. ఫలితాలు 31 సాయంత్రం 5 గంటలకే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పీసెట్‌ కన్వీనర్‌ పాల్‌కుమార్‌ వివరించారు. పోటీలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ 489 మంది అభ్యర్థులు పోటీల్లో పాల్గొంటారని ఆయన అన్నారు. అభ్యర్థులకు 100, 800 మీటర్ల పరుగు పందెం, షార్ట్‌పుట్‌, హైజంప్‌, లాంగ్‌ జంప్‌లతో పాటు వారు ఎంచుకునే క్రీడలలో పోటీలు పెట్టనున్నారు. ఇందుకోసం 40 మంది అధికారులను నియమించినట్లు అధికారులు వెల్లడించారు.