శ్రీవారిని దర్శించుకున్న పవన్

శ్రీవారిని దర్శించుకున్న పవన్

జనసేన పార్టీ అధక్షుడు పవన్ కల్యాణ్ శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ లో.. వైకుంఠ క్యూకాంప్లెక్స్‌ ద్వారం  నుంచి స్వామివారిని పవన్ దర్శించుకున్నారు. అంతకుముందు పవన్‌ శ్రీవారి దర్శనం కోసం శనివారం రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని హంపీమఠంలో పవన్ కల్యాణ్ బస చేశారు. పవన్ తిరుమలలో ఉన్నారన్న సమాచారంతో అభిమానులు, భక్తులు హంపీమఠం వద్దకు రావడంతో సందడి నెలకొంది. మఠం పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే పవన్‌ పర్యటనను పార్టీ వర్గాలు గోప్యంగా ఉంచాయి. మూడు రోజుల పాటు పవన్‌ ఏకాంతంగా గడుపుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

తిరుమలలో ఉండే మూడు రోజుల్లో ఇక్కడ ఉన్న తీర్థాలను, ఇతర దేవాలయాలను దర్శించుకోవడంతో పాటు భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను గురించి ఆయన స్వయంగా తెలుసుకుంటారని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. మూడు రోజుల తరువాత ఆయన నేరుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వెళ్లి అక్కడి నుంచి తన యాత్రను ప్రారంభిస్తారని తెలుస్తుంది.