పరవాడ ఫార్మా సిటీ ఘటనపై స్పందించిన పవన్..!

పరవాడ ఫార్మా సిటీ ఘటనపై స్పందించిన పవన్..!

విశాఖలో మరోసారి గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. ఫార్మా సిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకయ్యింది. దాంతో ఇద్దరు మరణించగా మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన మరియు నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండీస్ట్రీస్ లో విషవాయువు లీక్ ఘటన మరువక ముందే సాయినార్ సంస్థలో విషవాయువు లీకై ఇద్దరు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రసాయన పరిశ్రమల్లో రక్షణ చర్యలపై నిరంతర తనిఖీలు చేస్తుండాలని జనసేన ఎప్పటినుంచో చెబుతోందన్నారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని రసాయన పరిశ్రమల్లో వెంటనే సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని డిమాండ్ చేశారు.  నిబంధనలు పాటించకుండా ఉద్యోగులు, సమీప ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నందున నిపుణుల కమిటీతో విచారణ చేపట్టాలని తెలిపారు. ప్రమాదంలో  మృతి చెందినవారి కుటుంబాలకు ఆమోదయోగ్యమైన పరిహారం ఇచ్చి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.