జగన్ పాలనకు ఏడాది..ఏడాది పాలనలో మెరుపులు మరకలు...!

జగన్ పాలనకు ఏడాది..ఏడాది పాలనలో మెరుపులు మరకలు...!

ఆంధ్రప్రదేశ్ లో  సార్వత్రిక ఎన్నికల్లో జనం తీర్పు ఇచ్చి ఏడాది గడిచింది. రెండు పక్షాలు ఖచ్చితంగా ఈరోజు ఆ గెలుపోటములు గుర్తు చేసుకుంటాయి. జనం మళ్ళీ తీర్పు ఇవ్వడానికి ఇంకో నాలుగేళ్ళ సమయం ఉంది. ఇప్పుడే తొందరపడి తీర్పు ఇచ్చేయడం కూడా సరికాదు. మంచేదో, చెడేదో జనానికే బాగా తెలుసు. ఏడాది విజయాలను అధికార పక్షం గుర్తు చేసుకుంటే., కోర్టులలో విజయాలను ప్రత్యర్థులు గుర్తు చేసుకుంటారు.‘సరిగ్గా ఏడాది క్రితం కనివిని ఎరుగని రీతిలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు పట్టం కట్టారు. 175 స్థానాల్లో 151 స్థానాల్లో పార్టీ విజయం సాధించింది. 50 శాతానికిపైగా ఓట్లు, 86 శాతం సీట్లుతో వైస్సార్సీపీ ఘన విజయం సాధించింది.  

తనకు నచ్చింది చేసే విషయంలో జగన్ ఎంత పట్టుదలతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించి పలు నిర్మాణాలు వేగంగా సాగుతున్న వేళలో సడన్ గా రాజధాని మార్చి షాకిచ్చారు.రాజధానిని మొత్తం మూడు చోట్ల ఏర్పాటు చేయాలన్న నిర్ణయం కాస్తా వివాదాస్పదం అయింది. తనను విమర్శించే వారి వాదనల్ని వినేందుకు ఏ మాత్రం ఆసక్తిని చూపించని ఆయన.. ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. రైతులు నిరసనలు నిర్వహిస్తున్నా వెనక్కి తగ్గలేదు. 

క‌రోనా విప‌త్తులోనూ ప్ర‌జ‌ల‌కు తానిచ్చిన ఎన్నిక‌ల హామీల‌ను నెర‌వేర్చేందుకు ముందుకెళ్ల‌డం ప్ర‌తి ఒక్క‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. న‌వ‌త‌ర్నాల అమ‌లుకు ఏకంగా క్యాలెండ‌ర్‌నే విడుద‌ల చేయ‌డం జ‌గ‌న్ సాహ‌సానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం.మంచిపనులు ఎన్ని చేసినా.. ఒకట్రెండు వివాదాలు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉంటాయి. తిరుగులేని ప్రజాదరణతో ముఖ్యమంత్రి కుర్చీలోకూర్చున్న జగన్మోహన్ రెడ్డి.. తమ పార్టీ ఉనికిని చాటేలా.. ప్రభుత్వ కార్యాలయాల్ని పార్టీ రంగులతో నింపేస్తున్న తీరుపై హైకోర్టు నుంచి మొట్టికాయలు పడ్డాయి. అయినా.. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి.. మొండిగా వ్యవహరించటం లాంటివి ఏ మాత్రం మంచిది కాదు. పట్టువిడుపులు పాలకులకు ఉండాలి.

కోర్టు తీర్పులలో న్యాయాన్యాయాలను పక్కన పెడితే…, ఓ అవాంఛనీయ దూరం మాత్రం పాలనా వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు పెరిగింది. గతంలో న్యాయ వ్యవస్థ ఎప్పుడూ పరిపాలన అంశాల్లో ఇంతా యాక్టివ్ గా లేదు. అవసరమైనప్పుడు కూడా చూసి చూడనట్టు పోయింది. అప్పటి ప్రభుత్వం న్యాయ వ్యవస్థతో ఘర్షణ వైఖరి కోరుకోకపోవడం, లౌక్యంగా వ్యవహరించడం దీనికి కారణం. కోర్టు తీర్పులు ఆదేశాలతో ఎవరో ఒకరు నెగ్గారు, మరొకరు ఓడారు అనుకోడానికి ఏమీ లేదు. జనం అంతా గమనిస్తున్నారు. ఎవరికి వారే గౌరవాన్ని కాపాడుకోవాలి. పనిలో పనిగా ఏడాది విజయాలు ఓ వైపు, ఏడాది కోర్టు తీర్పుల మరో వైపు వీటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్తేనే పాలన గాడిన పడేది. మరో అవకాశం ఇచ్చేది.