ఏడాదిలో లక్ష కోట్ల రుణాల రద్దు

ఏడాదిలో లక్ష కోట్ల రుణాల రద్దు

మార్చి 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశంలోని పది ప్రధాన బ్యాంకులు లక్ష కోట్ల రూపాయల రుణాలను రద్దు చేశాయి. ఇవే బ్యాంకుల అంత క్రితం ఏడాదిలో రద్దు చేసిన రుణాలతో పోలిస్తే ఇవి 50 శాతం ఎక్కువ. రుణాలు రద్దు చేసినవాటిలో ఎస్‌బీఐ అ్రగస్థానంలో ఉంది. 2016-17లో రూ. 20,570 కోట్లను రద్దు చేసిన ఎస్‌బీఐ 2017-18లో రూ. 40,196 కోట్లను రద్దు చేసింది. సాధారణంగా ఇలాంటి రద్దును అడ్వాన్స్‌ అండర్‌ కలెక్షన్‌ అకౌంట్‌ కింద చూపుతారు. అంటే ఇలా రద్దు చేసిన రుణాలలో కొన్ని వసూలు కావొచ్చు. అనేక కంపెనీల దివాళా పిటీషన్లు దాఖలు చేసినందున ఈ మొత్తం ఈ ఏడాది మరింత పెరిగే అవకాశముందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. ఇన్సాల్వెన్సి అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) కింద దాఖలు చేసిన కంపెనీల రుణాలలో 30 శాతం నుంచి 70 మొత్తాన్ని రద్దు చేసేందుకు బ్యాంకులు అంగీకరించారు. ఉదాహరణకు భూషన్‌ స్టీల్‌ వంటి  కంపెనీల విషయంలో చాలా మొత్తం బ్యాంకులకు వెనక్కి వస్తుంది. అలాగే ఎలక్ట్రోస్టీల్‌, ఎస్సార్‌ స్టీల్‌ వంటి కంపెనీల రుణాలలో చాలా వరకు తిరిగి వచ్చే వీలు ఉన్నా.. ల్యాంక్‌ ఇన్‌ఫ్రా వంటి కంపెనీల విషయంలో బ్యాంకులు భారీ మొత్తాన్ని వొదులుకోవాల్సి రావొచ్చు. ల్యాంకో ఇన్‌ఫ్రా బ్యాంకులకు రూ. 45,300 కోట్లు బకాయి ఉంది. అలోక్‌ ఇండస్ట్రీస్‌ విషయంలోనూ అంతే జరగనుంది. ఈ కంపెనీ బ్యాంకులకు రుణపడిన మొత్తం రూ.30,000 కోట్లు కాగా, అతి కష్టంపై రూ 5000 కోట్లు రావొచ్చని బ్యాంకులు భావిస్తున్నాయి.