సోషల్ మీడియా కేసుల కోసం టీడీపీ స్పెషల్ లీగల్ టీమ్ !

సోషల్ మీడియా కేసుల కోసం టీడీపీ స్పెషల్ లీగల్ టీమ్ !


ఆంధ్రప్రదేశ్‌ లో వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్‌ వార్‌ ఓ రేంజ్‌ లో జరుగుతోంది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. కానీ వైసీపీ గురి చూసి వదులుతున్న బాణాలకు తెలుగు తమ్ముళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో కేడర్‌ను కాపాడుకునే పని టీడీపీకి సవాల్‌గా మారిందట. ఇదే ఆ పార్టీలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అధికార, విపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలినట్లుగానే సోషల్ మీడియాలో సైతం పోస్టులు, కామెంట్స్‌ వాడీవేడీగా ఉంటున్నాయి. దీంతో కేసులు నమోదై.. అరెస్ట్‌ల దాకా వెళ్తున్నాయి. అసత్య ప్రచారాన్ని, అసభ్య వ్యాఖ్యలను సహించేది లేదంటున్న సర్కార్‌.. సామాజిక మాధ్యమాల్లోని పోస్ట్‌లపై కఠినంగానే వ్యవహరిస్తోంది. 

టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు అభద్రతలో పడ్డారా?

టీడీపీ పోస్ట్‌లపై  వైసీపీ నేతల ఫిర్యాదు అందగానే.. అంతే వేగంగా పోలీసుల స్పందన ఉంటోంది. కేవలం పోస్టింగ్‌లే కాదు ఎక్కడి నుంచో వచ్చిన వాటిని ఫార్వర్డ్‌ చేసినా ఊరుకోవడం లేదు. ఇటీవల కాలంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులపై ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది సోషల్‌ మీడియా కార్యకర్తలు అభద్రతలో పడిపోయినట్లు సమాచారం.  

కేడర్‌ కాడి వదిలేయకుండా టీడీపీ ఫోకస్‌?

మొన్నటి వరకూ సామాజిక మాధ్యమాల్లో దూకుడుగా ఉన్నవారు ఇప్పుడు సైలెంట్‌ అయిపోతున్నారు. కరుడుగట్టిన అభిమానులు మాత్రం ఆగడం లేదట. అయితే కేడర్‌లో కలవరాన్ని గమనించిన తెలుగుదేశం అధిష్ఠానం అలర్ట్‌ అయ్యింది. కేడర్‌ కాడి వదిలేయకుండా ప్రణాళిక సిద్ధం చేసింది. 

ఈ కేసుల కోసమే 175 మంది లాయర్ల నియామకం !

కేసులు నమోదైన వెంటనే  వారిని ఆదుకునేందుకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 మంది లాయర్లను నియమించుకోవాలని స్థానిక నేతలకు టీడీపీ సూచించింది. అంటే నియోజకవర్గానికో లాయర్‌ ఈ కేసులపైనే ఉంటారన్నమాట. వీరిని సమన్వయం చేసేందుకు కేంద్ర కార్యాలయంలో లీగల్‌ టీమ్‌ తో పాటు అదనంగా అడ్వకేట్లను కేటాయించింది. ఏ సోషల్‌ మీడియా కార్యకర్తపై కేసు పెట్టినా వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేసిందట. 

చింతకాయల విజయ్‌కు సమన్వయ బాధ్యతలు!

మరి కేసుల వ్యవహరాలను సమన్వయం చేసేది ఎవరు? అందుకే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. కేసుల తీవ్రత.. అవసరాన్ని బట్టి ఇతర పార్టీ నాయకులను కూడా రంగంలోకి దించాలన్నది టీడీపీ వ్యూహంగా ఉంది. ఇదే సమయంలో కేసుల్లో ఇరుక్కున్న వారితో అగ్రనేతలు నేరుగా మాట్లాడతారట. ధైర్యం చెప్పి.. వారు వెనకడుగు వేయకుండా చూస్తారట. మొత్తానికి ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటం కంటే.. సోషల్‌ మీడియా వ్యవహారాలు, కేసులపై పోరాటమే  పెద్ద సవాల్‌గా మారిందనే కామెంట్స్‌ తెలుగుదేశం సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.