కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం..నిరవధిక వాయిదా !

కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం..నిరవధిక వాయిదా !

 
దేశమంతా లాక్ డౌన్ నడుస్తున్న సమయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి జరగాల్సిన జనాభా లెక్కలు, NPRలు.. వాయిదా పడ్డాయి.కరోనా వ్యాప్తి దృష్ట్యా కేంద్రం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 21రోజుల లాక్ డౌన్‌ను కేంద్రం ప్రకటించడంతో.. ఇవి వాయిదా పడ్డాయి. దేశ ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. ఇళ్లకే పరిమితం అవ్వాలని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో జనాభా లెక్కలను సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. అదే సమయంలో ఎన్‌పీఆర్ కూడా అప్‌డేట్ చేయాలనుకున్నారు. దేశంలో అసలు ఎంత మంది నివసిస్తున్నారన్నది లెక్క తేల్చడమే ఎన్‌పీఆర్ ఉద్దేశం.

ఏదైనా ఒక ప్రాంతంలో ఆర్నెళ్ల నుంచి నివసిస్తున్నవారిని, లేదా రాబోయే ఆర్నెళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఏదైనా ప్రాంతంలో ఉండాలని నిర్ణయించుకున్నవారిని స్థానిక పౌరులుగా గుర్తించి ఇంటింటికీ వెళ్ళి ఆ వివరాలను నమోదు చేస్తారు.లాక్ డౌన్‌తో ఇప్పటికే ప్రభుత్వం అన్ని కార్యక్రమాల్ని రద్దు చేసింది. తాజాగా రాజ్యసభ ఎన్నికల్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఇటు ఏపీలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే ఇటీవలి కాలంలో చాలా రాష్ట్రాలు NPRను వ్యతిరేకించాయి. తమ రాష్ట్రాల్లో వాటిని అనుమతించేది లేదంటూ.. అసెంబ్లీల్లో తీర్మానాలు సైతం చేశాయి. అయితే జనగణనకు మాత్రం సహకరిస్తామని స్పష్టం చేశాయి.