అన్ లాక్ 2.0 : ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చా !

అన్ లాక్ 2.0 : ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చా !

నిన్న రాత్రి కేంద్ర హోంశాఖ అన్ లాక్ 2.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్ డౌన్ విధించింది కేంద్రం. అయితే కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం ఇచ్చారు.  అయితే అంతర్జాతీయ విమానాలకి ఇంకా పర్మిషన్స్ ఇవ్వలేదు కానీ, హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు మేరకు, అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది కేంద్రం.

స్కూల్స్,కళాశాలలు, మెట్రోరైళ్లు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్‌, జిమ్‌లపై నిషేధం కొనసాగనుంది. అలానే సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యకలాపాలపై జులై 31 వరకు నిషేధం కొనసాగనుంది. పరిమిత సంఖ్యలో దేశీయ విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలకు అనుమతి ఇచ్చారు. దేశవ్యాప్తంగా రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. అత్యవసర సేవలకు, పారిశ్రామిక వస్తువుల తరలింపు, కార్గో గూడ్స్ సేవలకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు.

కంటైన్మెంట్ జోన్లలో  జులై 31 వరకు పూర్తీ లాక్ డౌన్ కొనసాగనుంది. కంటైన్మెంట్ జోన్లలో కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్లలో  నెలకొన్న పరిస్థితులను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు గమనించి అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 65ఏళ్ల వృద్ధులు, గర్భిణీలు,10 ఏళ్ళ లోపు చిన్నారులు ఇళ్లలోనే  ఉండాలని పేర్కొన్నారు.

విపత్తు నిర్వహణ చట్టం, 2005ను రాష్ట్రప్రభుత్వాలు తప్పనిసరిగా అమలుపరచాలని పేర్కొన్నారు.  అలాగే, ముందస్తు అనుమతులు, పాస్ లు అవసరం లేకుండానే ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చని స్పష్టం చేసింది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద పరిమితులు విధించే అవకాశం ఉంది.