త్వరలోనే కంటోన్మెంట్ రోడ్డు తెరుచుకుంటుంది

త్వరలోనే కంటోన్మెంట్ రోడ్డు తెరుచుకుంటుంది

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌‌లో సాధారణ ప్రయాణికులు ప్రయాణించే రోడ్డు త్వరలోనే తెరుచుకుంటుందన్నారు కేంద్ర రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్. ఢిల్లీలో ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని 62 కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై చాలా విజ్ఞప్తులు అందాయని.. అలాంటి వాటిలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా ఉందన్నారు.. రోడ్డు తిరిగి తెరిచేందుకు టీఆర్ఎస్ ఎంపీలతో పాటు.. స్థానిక ప్రజాప్రతినిధులు, మిలటరీ అధికారులతో చర్చలు జరిపామని నిర్మల అన్నారు. తమ పరిశీలనలో దేశ వ్యాప్తంగా మూసివేసిన 850 రోడ్లలో 119 రోడ్లను సరైన నిబంధనలు పాటించకుండా మూసేశారని.. వాటిని తక్షణమే రీ-ఓపెన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. వీటిలో 80 రోడ్లు పూర్తిగా తెరుచుకోగా.. మరో 15 పాక్షికంగా.. మిగతా 24 రోడ్లు ఇంకా తెరుచుకోలేదని.. ఇవి కూడా తెరచుకునేలా చూస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి బైసన్ పోల్ గ్రౌండ్ ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని.. తమ దగ్గర నుంచి తీసుకున్న స్థలానికి వేరే చోట స్థలం కేటాయిస్తే చాలని స్పష్టం చేశారు. కానీ, బైసన్‌పోల్ గ్రౌండ్ విషయంలో కొందరు కోర్టుకు వెళ్లారని.. కోర్టు ఆదేశాలు వచ్చే దాకా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఆమె వెల్లడించారు.