పాస్ పోర్ట్ రద్దయినా నాలుగు దేశాలు తిరిగాడు

పాస్ పోర్ట్ రద్దయినా నాలుగు దేశాలు తిరిగాడు

బ్యాంకులకు టోపీ వేసి విదేశాలకు పారిపోయే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ వర్గాల అండదండలు పుష్కలంగా ఉంటున్నాయి. విజయ్ మాల్యా విదేశీ ప్రయాణాలను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆయన హాయిగా సొంత జెట్ ఎక్కి ఇంగ్లాండ్ చెక్కేశాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) లో వేలకోట్ల స్కామ్ చేసి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త నీరవ్ మోడీ కూడా రద్దయిన పాస్ పోర్ట్ మీదే నాలుగు సార్లు మూడు దేశాలకు ప్రయాణించినట్లు బయటపడటంతో దేశంలో ప్రభుత్వ విభాగాలు ఎంత సమన్వయంతో పనిచేస్తున్నాయో తేటతెల్లమవుతోంది. రూ.13 వేల కోట్లకు పైగా స్కామ్ చేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ.. రద్దయిన పాస్ పోర్ట్ పై నాలుగు దేశాల్లో తిరిగినట్టు సీబీఐకి ఇంటర్‌పోల్ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 24న నీరవ్ మోడీ, ఆయన మామ మెహుల్ చోక్సీ పాస్‌పోర్టులను భారత విదేశీ వ్యవహారాల శాఖ రద్దు చేసింది. అయినా ఆయన మార్చిలో విదేశాలకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. మార్చి 15-31 మధ్య అమెరికా, బ్రిటన్, హాంకాంగ్‌ల మధ్య ప్రయాణించాడని ఇంటర్ పోల్ అధికారులు సీబీఐకి జూన్ 5న లేఖ రాశారు. 

పీఎన్బీ కుంభకోణం వెలుగు చూడకముందే నీరవ్ మోడీ, అతని భార్య అమి, సోదరుడు నిషీల్, మామ చోక్సీ జనవరి మొదటి వారంలో విదేశాలకు పారిపోయారు. తన బండారం బయటపడనుందని ఊహించిన నీరవ్, జనవరిలోనే సింగపూర్‌ శాశ్వత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నీరవ్ యూకేలో, చోక్సీ అమెరికాలో ఉన్నారు. నీరవ్ మోడీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాల్సిందిగా సీబీఐ ఇంటర్ పోల్‌ను కోరింది.