మీకూ కరోనా సోకిందనుకోండి..ప్రధాని సంచలనం !

మీకూ కరోనా సోకిందనుకోండి..ప్రధాని సంచలనం !

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. దాదాపు ప్రతిరోజు 50 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ లెక్కల ప్రకారం.. ఈ మహమ్మారి వ్యాప్తి వేగం పుంజుకుంది. చైనాలో ఈ వైరస్ ప్రారంభం నుంచి లక్ష కేసుల సంఖ్యకు చేరుకోవడానికి దాదాపు 67 రోజులు పట్టింది. ఆ తర్వాత 11 రోజులకే రెండు లక్షల కేసులు నమోదయ్యాయి. ఇక నాలుగు రోజుల్లోనే మూడు లక్షల కేసులు దాటాయి. ఇక దాదాపు రెండు రోజుల్లోనే నాలుగు లక్షల కేసులు దాటినట్లు తెలుస్తోంది. ఇక మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ.. 20వేలకు చేరువైంది. అన్ని దేశాలు జాగ్రత్త పడుతున్నారు.

దీంతో ఒకవేళ మీకు కరోనా వైరస్‌ సోకితే ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తారో ప్రస్తుతం అలాగే మసులుకోవాలని న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జసిండా అర్డెర్న్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌పై నిర్లక్ష్యం వహించకుండా వారికే వైరస్‌ సోకిందనే భావనతోనే అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలపాటు లాక్‌డౌన్‌ విధిస్తూ న్యూజిలాండ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో దేశప్రజలనుద్ధేశిస్తూ ప్రధాని జసిండా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా గొలుసుకట్టు వ్యాప్తిని కట్టడి చేసేందుకే నాలుగువారాల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని పార్లమెంట్‌లో ప్రకటించారు. దేశంలో ఇప్పటివరకు కొవిడ్‌-19తో ఒక్కమరణం కూడా సంభవించనప్పటికీ ముందు జాగ్రత్తలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.