భర్తను చంపించిన భార్య: భార్య ప్రియుడు అరెస్ట్

భర్తను చంపించిన భార్య: భార్య ప్రియుడు అరెస్ట్

ఇష్టం లేని పెళ్లి చేశారన్న కోపంతో ప్రియుడితో కలిసి భర్తను చంపించిన ఘటన విజయనగరం జిల్లాలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ కేసు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గరుగుబిల్లి మండలం తోటపల్లికి చెందిన యువకుడికి సరస్వతి అనే యువతితో ఇటీవల వివాహం అయ్యింది. అయితే ఆమె పెళ్లికి ముందే శివ అనే వ్యక్తిని ప్రేమించింది. తనకు ఏమాత్రం ఇష్టం లేకుండా పెద్దలు పెళ్లి చేయడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దానిని పైకి కనిపించనీయకుండా.. భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది.

దీనిలో భాగంగా ప్రియుడు, అతని స్నేహితుల సాయంతో భర్త శంకర్‌రావును చంపేందుకు కుట్రపన్నింది. ప్లాన్‌లో భాగంగా ఈ నెల 8న భర్తతో కలిసి విజయనగరం చేరుకుని బైక్ సర్వీసింగ్ ఇచ్చి.. తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకుంటుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దంపతుల మీద దాడి చేశారు. నగలను దోచుకెళ్ళారు.. ఇనుపరాడ్‌తో బలంగా మోదడంతో శంకర్‌రావు అక్కడికక్కడే మరణించగా.. సరస్వతికి తీవ్ర గాయాలయ్యాయి.. అందరికి ఇది దొంగల పనిగా చెప్పింది.. అదే నిజమని జనం నమ్మారు కూడా.. అయితే పోలీసుల రంగప్రవేశంతో అసలు నిజం తెలిసింది.

హత్య గురించి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ స్పాట్‌కు వెళుతుండగా.. దారిలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సమయంలో ఒక ఆటోలోని వారు అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రశ్నించగా అసు నిజం వెలుగులోకి వచ్చింది. సరస్వతే భర్తను చంపించడానికి ఇలా చేసిందని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆ ఆటోలో అసలు నిందితుడు శివ తప్పించుకోవడంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా అరకులో శివను అదుపులోకి తీసుకున్నారు.