సాయిసుధ - శ్యామ్ కె.నాయుడు కేసులో కొత్త ట్విస్టు.. బెయిల్ రద్దు

సాయిసుధ - శ్యామ్ కె.నాయుడు కేసులో కొత్త ట్విస్టు.. బెయిల్ రద్దు

టాలీవుడ్‌లో పేరుమోసిన కెమెరామ్యాన్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు శ్యామ్.కె.నాయుడు తనను మోసం చేశాడంటూ సాయి సుధ అనే సినీ ఆర్టిస్ట్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే . తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్నేళ్లుగా తనతో రిలేషన్‌షిప్ మెయింటెన్ చేసిన శ్యామ్ కే నాయుడు ఇప్పుడు పెళ్లి మాట దాటేస్తున్నాడని సాయి సుధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లోకేసు నమోదైంది. పోలీసులు శ్యామ్ కె నాయుడుని అరెస్ట్ చేశారు. అయితే రిమాండ్‌కు తరలించిన రెండు రోజులకే శ్యామ్ కె నాయుడు బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే బెయిల్ మంజూరు కోసం శ్యామ్ కోర్టుకు సమర్పించిన పత్రాలు నకిలీవని సాయి సుధ కోర్టుకు తెలిపారు. దీంతో తాజాగా నాంపల్లి కోర్టు శ్యామ్ కె నాయుడు బెయిల్ రద్దు చేసింది. సాయి సుధ,తానూ ఇద్దరం రాజీకొచ్చామని పేర్కొంటూ శ్యామ్ కె నాయుడు నాంపల్లి న్యాయస్థానంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఫోర్జరీ సంతకంతో ఈ పిటిషన్ వేసినట్టు విచారణలో వెల్లడైంది.దీంతో శ్యామ్ కె నాయుడు పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఆయన బెయిల్‌ను కూడా రద్దు చేసింది. అంతేకాకుండా, శ్యామ్ కె నాయుడుపై ఫోర్జరీ కేసును నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.