నిజామాబాద్‌ జిల్లాలో కొత్త రకం దొంగలు...!

 నిజామాబాద్‌ జిల్లాలో కొత్త రకం దొంగలు...!

కొరియర్‌ అంటూ ఎవరైనా తలుపుతడితే వెళ్లి ఠక్కున తీస్తున్నారా ? అయితే జాగ్రత్త.. ఎందుకంటే.. కొరియర్‌ బాయ్స్‌ వేషాల్లో దోచుకుపోయే కేటుగాళ్లు తయారయ్యారు. కరోనా సడలింపులతో కనుమరుగైపోయిన దొంగలు మళ్లీ ప్రత్యక్షమవుతున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు సరికొత్త ప్లాన్‌లు వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొరియర్ బాయ్స్ పేరిట వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో నగర వాసులు తెగ భయపడుతున్నారు. శివారు ప్రాంత వాసులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. శివారు ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న ఇళ్లనే టార్గెట్‌గా చేసుకొని చోరీలు చేస్తున్నారు.

నిజామాబాద్ పట్టణంలోని గాయత్రీనగర్ శివారులో పద్మ అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయం ముందే బైక్‌పై వచ్చి రెక్కీ నిర్వహించారు దొంగలు. ఆ తర్వాత కొరియర్ బాయ్స్ పేరిట వచ్చారు. సదరు మహిళతో మేం కొరియర్ బాయ్స్ అని మాట కలిపారు. ఈ అడ్రస్ మీదేనా అని అమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మాట్లాడుతూనే ఒకడు ఆమె గొంతును గట్టిగా పట్టుకొన్నాడు. మెడలో ఉన్న మూడు తులాల పుస్తెల తాడును బలవంతంగా లాగేశాడు. అదే సమయంలో మహిళ ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న కారం ఆమెపై చల్లారు. దీంతో పద్మ భయంతో పరుగులు తీసింది. కరోనా భయంతో టెన్షన్ పడ్డ నగరవాసులు..ఇప్పుడు దొంగలతో భయపడాల్సి వస్తోంది. పోలీసులు అపరిచిత వ్యక్తులు ఎవరైనా అనవసరంగా ఇళ్లలోకి వస్తే తలుపు తీయొద్దని చెబుతున్నారు.