చైనాకు కొత్త తలనొప్పి.. విదేశాల నుంచి మళ్లీ వైరస్...!

చైనాకు కొత్త తలనొప్పి.. విదేశాల నుంచి మళ్లీ వైరస్...!

కరోనా వైరస్ పుట్టింది అక్కడే అయినా.. ఇప్పుడు చైనాకు కొత్త సమస్యలు వస్తున్నాయి. డ్రాగన్ కంట్రీలో పుట్టిన వైరస్ ఇప్పటి వరకు 190 దేశాలకు పాకిపోగా... ఆ దేశంలో మాత్రం కఠిన చర్యలకు పూనుకుని.. అదుపులోకి తెచ్చింది. చైనాలో ఇప్పటి వరకు ఎంత మంది మరణించారు అనేదానిపై సరైన లెక్కలు చూపడంలేదని ప్రచారం కూడా ఉంది. అయితే, కొన్ని రోజులు చైనాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో.. అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఇదే సమయంలో చైనాకు కొత్త సమస్య ఎదురవుతోంది. విదేశాల నుంచి వ‌చ్చిన వారిలో ఈ వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి.  దీంతో రెండో ద‌ఫా ఇన్ఫెక్ష‌న్లు సోకుతున్న‌ట్లు ప్రాథ‌మికంగా తెలుస్తోంది.  చైనాలో కొత్తగా 78 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వుహాన్‌ సిటీలో సుమారు వారం రోజుల త‌ర్వాత ఒక కొత్త కేసు నమోదు అయినట్టు చెబుతున్నారు. కాగా, గ‌త ఏడాది వుహాన్ సిటీలోనే కరోనా వైరస్ పుట్టుకొచ్చింది. చైనా నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయిన ఈ మాయదారి వైరస్.. మళ్లీ ఇప్పుడు ఆయా దేశాల నుంచి దిగుమతి అవుతూ టెన్షన్ పెడుతోందట. అయితే, చైనాలో కరోనా తగ్గుముఖం పట్టడంతో... ప్రజలపై ప్రయాణ పరిమితులను ఎత్తివేసింది.. ఇదే, సమయంలో ఇతర దేశాల నుంచి వచ్చేవారిలో కొత్త కేసులు నమోదు అవుతుండడంతో.. నిబంధనలు కఠినతరం చేస్తోంది.