లాక్‌డౌన్‌ 4.0.. ఇవాళ్టి నుంచి ఇవి ఓపెన్...!

లాక్‌డౌన్‌ 4.0.. ఇవాళ్టి నుంచి ఇవి ఓపెన్...!

కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ 3.0 ముగిసింది.. మార్చి 24న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని న‌రేంద్ర మోడీ.. దేశ‌మంతా లాక్ డౌన్ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వ‌ర‌కు 21 రోజుల పాటు తొలి ద‌శ లాక్ డౌన్ అమలు చేశారు.. ఆ త‌ర్వాత క‌రోనా కేసుల సంఖ్య పెర‌గ‌డంతో మే 3 వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. మ‌ళ్లీ మే 17 వ‌ర‌కు మ‌రోసారి లాక్ డౌన్ పొడిగించారు.. తాజాగా మళ్లీ మే 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, లాక్‌డౌన్‌ పొడిగిస్తూ వస్తూనే.. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి క్రమంగా కొన్ని సడలింపులు ఇస్తూనే వస్తోంది కేంద్రం.. తాజాగా, లాక్‌డౌన్‌ 4.0కు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. అయితే, కొన్ని రాష్ట్రాలు యథావిథిగా కేంద్రం నిర్ణయాలు అమలు చేస్తుండగా.. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ పొడిగించినందున.. మరోసారి కేంద్రం గైడ్‌లైన్స్‌పై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నాయి..

లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలు:
* లాక్‌డౌన్‌ ముగియడంతో.. “జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ” (ఎన్‌‌డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులు జారీ. 
* రైలు, విమాన, మెట్రో సర్వీసులపై మే 31 వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టం.
* కంటైన్‌మెంట్‌ జోన్ల మినహా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు వెసులుబాటు. 
* రాష్ట్రాల పరస్పర అంగీకారంతో అంతర్రాష్ట్ర సర్వీసులను  నడుపుకోవచ్చు.
* దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. 
* దేశీయంగా మెడికల్‌ సేవలు, దేశీయ ఎయిర్‌ అంబులెన్స్‌లు, భద్రతకు సంబంధించినవి, ఎంఏహెచ్‌ అనుమతించిన వాటికి మినహాయింపు.
* మెట్రో రైలు సేవలు అనుమతి లేదు.
* పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు/కోచింగ్‌ సెంటర్లు మూసి ఉంటాయి.
* ఆన్‌లైన్‌/డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ( ఆన్ లైన్ భోధన)ఎప్పటిలాగే కొనసాగుతాయి. 
* హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు అనుమతి లేదు. 
* వైద్య, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, హెల్త్‌కేర్‌ వర్కర్లలకు సేవలందించే, క్వారంటైన్‌లో ఉన్న పర్యాటకులకు వసతి కల్పించే వాటికి అనుమతి. 
* ఇంటికి సరఫరా చేస్తున్న రెస్టారెంట్లకు అనుమతులు.
* బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉన్న క్యాంటిన్లు నడిపేందుకు అనుమతులు.
* సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, ఇతర వినోద ప్రాంతాలు తెరిచేందుకు అనుమతి లేదు.
* రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలకూ అనుమతి లేదు.
* మతపరమైన సంస్థల్లో ప్రజలకు అనుమతి లేదు.. మతపరమైన ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించడానికి లేదు.
* కంటైన్మెంట్‌, బఫర్‌, రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్ల నిర్ణయాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలదే.  
* కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలి. 
* రెడ్‌, ఆరెంజ్‌, కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్ల సరిహద్దులు ఆ జిల్లా అధికారులు నిర్ణయిస్తారు. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఉండాలి.
* కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు. ప్రజలు రోడ్లమీదకు రాకూడదు.
* కంటైన్మెంట్‌ జోన్లలో ప్రతి ఇంటిపైనా నిఘా ఉండాలి. అయితే, అత్యవసర  వైద్య పరీక్షలు, సేవలు అందించాలి.
* రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ 144వ సెక్షన్‌ అమలు.