వాళ్లను చంపడానికి అనుమతించాలా..?

వాళ్లను చంపడానికి అనుమతించాలా..?

2008 నవంబర్ 26న దేశ వాణిజ్య నగరంపై ఉగ్రవాదులు దాడి చేయడం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. లష్కరే తొయిబాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ఛత్రపతి శివాజీ టెర్మినల్, నారీమన్ పాయింట్, తాజ్‌హోటల్, మెట్రో సినిమా హాల్, ఒబెరాయ్ ట్రైడెంట్‌లోకి చొరబడి మూడు రోజుల పాటు సృష్టించిన నరమేధంలో 166 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు.. భారత్‌తో పాటు ప్రపంచం మొత్తం ఈ దాడి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పనేనని ఆరోపిస్తున్నప్పటికీ.. దాడుల సూత్రధారి సయిద్ హాఫీజ్‌ పాక్‌లోనే ఉన్నప్పటికీ.. తమకు సంబంధం లేదని బుకాయిస్తూ వచ్చింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో 26/11 మారణ హోమం మా దేశానికి చెందిన ఉగ్రవాదుల పనేనంటూ సాక్షాత్తూ ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ది డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారిగా దేశంలో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై పెదవివిప్పారు. అంతేకాదు ఉగ్రవాదులు దేశంలోకి.. ఇతర దేశాల భూభాగాల్లోకి విచ్చలవిడిగా ప్రభుత్వం ఎందుకు చూసిచూడనట్లుగా వదిలేస్తుందని ప్రశ్నించారు. ముంబై దాడుల వెనుక సూత్రధారిగా భావించబడుతున్న వ్యక్తి దేశంలో ఉగ్రసంస్థలను నిర్వహిస్తున్నడని తెలిసినా అతనికి ఎందుకు శిక్ష మినహాయించారని పాక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాక్‌లో ఎన్నో ఉగ్రవాద సంస్థలు చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని.. వాటన్నింటిపైనా నిఘా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని.. అలాగే భారత ప్రభుత్వం కూడా సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని షరీఫ్ అన్నారు. ఈ ఘటనకు సంబంధించి రావల్పిండిలోని తీవ్రవాద వ్యతిరేక కోర్టు తన విచారణను ఇంకా పూర్తి చేయలేదని.. పాక్ ప్రభుత్వం ఇందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని షరీఫ్ ఆరోపించారు. కాగా ఆయన వ్యాఖ్యలు రెండు దేశాల్లోనూ కలకలం రేపాయి.