అంగారకుడిపై జీవం?

అంగారకుడిపై జీవం?

అంగారక గ్రహం అధ్యయన నిమిత్తం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపించిన క్యూరియాసిటీ రోవర్‌.. మార్స్‌లోని గుట్టును మెల్లగా చేధిస్తోంది. ఈ అరుణ వర్ణ గ్రహంపై జీవం మనుగడకు సంబంధించిన అధ్యయనంలో మరో ముందడుగేసింది. అంగారక గ్రహానికి చెందిన శిలలపై సేంద్రియ అణువులు. మీథేన్‌ ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సేంద్రియ అణుల్లో కార్బన్‌, హైడ్రోజన్‌తోపాటు ఆక్సిజన్‌, నైట్రోజన్‌ ఉండవొచ్చని భావిస్తున్నారు. అలాగే.. అంగారక గ్రహంపై మూలాధార జీవులు మీథేన్ ను ఆహార వనరుగా ఉపయోగించుకుని ఉంటాయని వారు ఓ అంచనాకు వచ్చారు. మీథేన్ వాయువు జీవి ఉనికికి ఆధారమని,  జీవరసాయనిక చర్య కారణంగానే మీథేన్ వెలువడుతుందని తెలిపారు. అంగారకుడిపై జీవం ఉందని దీని ద్వారా చెప్పలేనప్పటికీ.. ఆ దిశగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయని నాసా శాస్త్రవేత్త మైఖేల్‌ మేయర్‌ అన్నారు. ఇక.. అంగారకుడిపై గతంలో నీరు ఉండేదని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిర్ధారించిన సంగతి తెలిసిందే.