మానవత్వం లేని వ్యక్తి జగన్: మంత్రి నక్కా

మానవత్వం లేని వ్యక్తి జగన్: మంత్రి నక్కా

మానవత్వం లేని వ్యక్తి జగన్ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు మంత్రి నక్కా ఆనందబాబు. గురువారం నక్కా మీడియాతో మాట్లాడుతూ... ప్రకృతి వైపరీత్యాల వల్లే గోదావరి పడవ ప్రమాదం జరిగిందన్నారు. పడవ ప్రమాదం దురదృష్టకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. పడవ ప్రమాదంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందించకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నక్కా. ఈ ఘటనపై మానవత్వం ఉన్న ఎవరైనా స్పందిస్తారని.. కానీ ప్రతిపక్ష నేత జగన్ వైఖరి మాత్రం సిగ్గుపడేలా ఉందన్నారు. ప్రతి వారం కోర్టుకు వెళ్లేందుకు పాదయాత్రను ఆపే జగన్.. గిరిజనులు చనిపోతే వారి కుటుంబ సభ్యులను పరామర్శించలేరా అని ప్రశ్నించారు. పైగా గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తూ కూడా బాధితులను పరామర్శించకపోవడం దారుణం అని విమర్శించారు. పైగా ఇవన్నీ ప్రభుత్వ హత్యలనడానికి సిగ్గు ఉండాలన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నపుడు ఎన్నో ఘటనలు, హత్యలు జరిగి ప్రజల ప్రాణాలు పోతే.. అవి సర్కారీ హత్యలేనా? అని ఆనందబాబు ప్రశ్నించారు. మక్కా మసీద్‌లో పేలీన బాంబ్‌లు ఆ ప్రభుత్వమే పెట్టించిందా అని నిలదీశారు.

మరోవైపు కన్నా లక్ష్మీనారాయణపైనా ధ్వజమెత్తారు. కన్నా స్వచ్చమైన సంఘ్ కార్యకర్తలా మాట్లాడాటం సరికాదన్నారు. మొన్న కాంగ్రెస్.. నిన్న వైసీపీలో చేరపోయే ప్రయత్నం చేసి పదవి కోసం మళ్ళీ బీజేపీకి వెళ్లటం సిగ్గు చేటన్నారు. వారం రోజుల్లో రెండు పార్టీలతో కన్నా దోబుచులాట ఆడారని విమర్శించారు. కన్నాకు సిగ్గులేకపోయినా.. బ్యానర్లు కట్టే కార్యకర్తలకైనా సిగ్గు  ఉండాలన్నారు. వైసీపీ, బీజేపీలు రెండు తొడుదొంగలు.. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి కర్ణాటకలో బీజేపి గద్దెనెక్కిందన్నారు.