మూవీ రివ్యూ : 'ఆఫీసర్'

మూవీ రివ్యూ : 'ఆఫీసర్'

నటీనటులు : నాగార్జున, 'బేబీ' కావ్య, మైరా సరీన్, అన్వర్ ఖాన్, ఫిరోజ్ అబ్బాసీ, షాయాజీ షిండే, అజయ్ తదితరులు 

ఛాయాగ్రహణం : భరత్ వ్యాస్, రాహుల్ పెనుమత్స 

సంగీతం : రవిశంకర్ 

దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ

నిర్మాతలు : రామ్ గోపాల్ వర్మ, సుధీర్ చంద్ర  

విడుదల తేదీ : 01 జూన్ 2018

'శివ'తో దర్శకుడిగా పరిచయమైన వర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ మెట్టు ఎక్కించాడు. కొత్త కొత్త సినిమాలు రావడానికి కారకుడు అయ్యాడు. తెలుగు సినిమాని 'శివకి ముందు... శివకి తరవాత' అని విశ్లేషిస్తే అతిశయోక్తి కాదు. సాంకేతికంగా వర్మ తీసుకొచ్చిన విప్లవం అటువంటిది. తరవాత తెలుగు సినిమా చాలా మెట్లు ఎక్కింది. కానీ, వర్మ మాత్రం పైకి ఎక్కడం మానేసి దిగారు. ఒకప్పుడు సినిమాలతో సంచలనం సృష్టించిన వర్మ, తరవాత వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్లతో సంచలనం అయ్యారు. ఇక, అయన సినిమాల గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం ఎప్పుడో మానేశారు. ప్రయోగాత్మక సినిమాలు 'ఐస్‌క్రీమ్‌', 'దొంగల ముఠా'.. వర్మకు ఇష్టమైన రౌడీయిజమ్ నేపథ్యంలో తీసిన 'వంగవీటి', 'ఎటాక్'... అన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. స్టార్ హీరోలు వర్మ వైపు చూడటం మానేసిన సమయంలో, వరుస ఫ్లాపులతో ప్రేక్షకుల్లో వర్మపై నమ్మకం పోయిన సమయంలో నాగార్జున అతడికి అవకాశం ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. 'ఆఫీసర్' కథలో, సినిమాలో అంతలా ఏముంది? 'శివ'తో తెలుగు సినిమా ట్రెండ్ సెట్ చేసిన నాగార్జున, వర్మ కాంబినేషన్... 'ఆఫీసర్'తో ఏం చేసింది? రివ్యూ చదవండి.

కథ :

నారాయణ పసారి (అన్వర్ ఖాన్) ముంబైలో మంచి పేరున్న పోలీస్ ఆఫీసర్. మాఫియా, అండ‌ర్‌వ‌ర‌ల్డ్‌ని అంతం చేసిన ఘనత అతని సొంతం. అటువంటి ఆఫీసర్ మీద ఫేక్ ఎన్కౌంటర్ ఆరోపణలు రావడంతో విచారణ కోసం హైదరాబాద్ ఆఫీసర్ శివాజీరావు (నాగార్జున)ని ఎస్ఐటి (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) హెడ్‌గా నియమిస్తారు. శివాజీరావు విచారణలో పసారిపై ఆరోపణలు నిజమని తేలడంతో అతణ్ణి అరెస్ట్ చేస్తారు. అయితే... జైల్లో వున్న పసారి తన మనుషుల చేత సాక్షిని చంపించి, నిరపరాధిగా బయటకు వస్తాడు. తరవాత ముంబైలో కొత్త అండ‌ర్‌వ‌ర‌ల్డ్‌ కంపెనీ పుట్టుకువస్తుంది. దానివెనుక పసారి వున్నాడని శివాజీరావు తెలుసుకుంటాడు. అయితే... ఇవేవీ తెలియని పోలీస్ శాఖ కొత్త  అండ‌ర్‌వ‌ర‌ల్డ్ కంపెనీని అంతం చేయడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ టీమ్‌కి పసారిని హెడ్‌గా నియమిస్తుంది. అందులో శివాజీరావు సభ్యుడు. పసారి తెలివిగా శివాజీరావుని ఇరికిస్తాడు. కొత్త  అండ‌ర్‌వ‌ర‌ల్డ్ కంపెనీ అతడిదే అని పోలీస్ శాఖను, ప్రజలను నమ్మిస్తాడు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తున్న పసారి కథను శివాజీ ఎలా అంతం చేశాడనేది మిగతా సినిమా. 

నటీనటుల పనితీరు :

నటుడిగా నాగార్జునకు వంక పెట్టలేం. ఆయన అనుభవంతో సన్నివేశాలను రక్తి కట్టించడానికి ప్రయత్నించారు. ఫైట్స్ సీన్లలో డూప్ లేకుండా కష్టపడి మరీ చేశారు. పసారి పాత్రలో అన్వర్ ఖాన్ నటన విసుగు తెప్పిస్తుంది. అజయ్ నటన పర్వాలేదు. నాగార్జున కుమార్తెగా బేబీ కావ్య కొంచెం ఓవర్ చేసింది. మైరా సరీన్ యాక్టింగ్ మెటీరియల్ కాదు. తెలుగు ప్రేక్షకులకు మిగతా ముఖాలు పెద్దగా పరిచయం లేదు. వాళ్ళు చేసింది కూడా ఏమీ లేదు. ఓవర్ చేయడం తప్ప! 

సంగీతం - సాంకేతిక వర్గం : 

కొందరు దర్శకులు మాత్రమే సంగీత దర్శకులను, సాంకేతిక నిపుణులను శాసించే స్థాయిలో వుంటారు. అటువంటి వారిలో వర్మది ఫస్ట్ ప్లేస్. ఒకవేళ  స్క్రీన్ మీద దర్శకుడిగా వర్మ పేరు వేయకున్నా... టీజర్, ట్రైలర్ చూసి 'ఇది వర్మ సినిమా' అని చెప్పేయొచ్చు. ఆయన సినిమాల్లో కెమెరా యాంగిల్స్, మ్యూజిక్, యాక్టర్స్ బిహేవియర్ సపరేట్ స్టైల్‌లో ఉంటాయి. అందుకు 'ఆఫీసర్' సినిమా అతీతం కాదు. టెక్నీషియన్స్ అందరూ రెగ్యులర్ వర్మ సినిమాలకు పని చేసినట్టు చేశారు. ఇక, సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు నుంచి సౌండ్ ఎఫెక్ట్స్ గురించి తెగ చెబుతున్నారు. తీరా సినిమాకి వెళ్ళి చూస్తే... అంత లేదక్కడ. టీజర్, ట్రైలర్స్‌కి ఆశించిన స్పందన రాకపోవడంతో సినిమాపై ఆసక్తి కలిగించడానికి అలా చెప్పారేమో అనిపిస్తుంది.

దర్శకత్వం : 

వర్మ మారలేదు... సినిమా చూశాక ఎవరైనా చెప్పే మాట ఇదే. ఇటువంటి నేపథ్యంలో వర్మ ఇంతకు ముందు చాలా సినిమాలు చేశాడు. అయితే... పోలీస్ అండ‌ర్‌వ‌ర‌ల్ట్‌ కంపెనీ పెట్టాలనుకోవడం కథాపరంగా అతను వేసిన కొత్త ఎత్తుగడ. కానీ, అంతే కొత్తగా సినిమాను తీయలేకపోయాడు. సేమ్ ఓల్డ్ కెమెరా యాంగిల్స్, సేమ్ ఓల్డ్ స్టంట్స్, సేమ్ ఓల్డ్ టేకింగ్. రియలిస్టిక్ అప్రోచ్ పేరుతో చాలా సన్నివేశాలను సాగదీశాడు. ఒకవేళ 'శివ' వచ్చిన రెండు మూడేళ్లకు ఈ సినిమా తీసుంటే ప్రేక్షకులకు కొత్తగా అనిపించేది. ఇటువంటి సినిమాలు వర్మే చాలా తీయడంతో రొటీన్ ఫీల్ అందించింది.

విశ్లేషణ :

రామ్ గోపాల్ వర్మపై మరోసారి నాగార్జున పెట్టుకున్న నమ్మకాన్ని, ప్రేక్షకుల అంచనాలను వమ్ము చేస్తుందీ సినిమా. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. కొన్ని సందర్భాల్లో వర్మ మునుపటి దర్శకుణ్ణి బయటకు తీశాడనిపిస్తుంది. కానీ, అంతలోనే సినిమాను కిందకు పడేస్తాడు. కథ అయితే రాసుకున్నాడు గానీ... కథను అంతే బలంగా చెప్పగలిగే సన్నివేశాలు, సన్నివేశాలకు తగ్గట్టు మాటలు రాసుకోవడంలో అలసత్వం ప్రదర్శించాడు. అప్పుడు నాగార్జున మాత్రం ఏం చేయగలడు?! సన్నివేశం మంచి ఆసక్తిగా మారుతుందని, ఉత్కంఠ కలిగిస్తుందని అనుకున్న ప్రతిసారీ మాటలకు ఫుల్ స్టాప్ పెట్టి, మ్యూజిక్ స్టార్ట్ చేస్తాడు. బ్యాగ్రౌండ్‌లో సౌండ్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా... అక్కడ ఏం జరుగుతుందో ప్రేక్షకులకు అర్థం కావడమూ ముఖ్యమే. ఈ సంగతి పట్టించుకోకుండా కేవలం సౌండ్ మీద దృష్టి పెట్టారు. దాంతో ఇది నాగార్జున సినిమాగా కాకుండా... మరో వర్మ సినిమాగా మిగిలింది. ప్రేక్షకులకు నిరాశ మిగిల్చింది.